నిబంధనల మేరకు ఇసుక అనుమతులు
● టాస్క్‌ఫోర్స్ కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: జిల్లాలో గుర్తించిన ప్రాంతాల నుంచి ఇసుక తరలింపునకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన డీఎల్‌ఎస్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగనూర్ మండలం గజరాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు తన పట్టా భూమిలో దాదాపు 7,743 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగింపునకు దరఖాస్తు చేసుకోగా.. సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భజలశాఖ, సర్వే ల్యాండ్, నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారుల నివేదికల ఆధారంగా ఇసుక అనుమతికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇసుక తరలించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ కార్యదర్శులతో కలిపి ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేసి.. ఇసుక తరలింపు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఒక్క ఫోన్ తనకు వచ్చినా.. ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేస్తానని.. ఇకముందు ఎలాంటి అనుమతులు ఇవ్వనని కలెక్టర్ స్పష్టంచేశారు. అంతకుముందు కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంతమేర ఇసుక అవసరమనే వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, మైనింగ్ రాయల్టీ అధికారి ప్రతాప్ రెడ్డి, మైనింగ్ ఏడీ గోవిందరాజు ఉన్నారు.
● మండలాల వారీగా నిర్దేశించిన సీ్త్రనిధి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలపై అప్పు నిలువ రూ. 74.5కోట్లు ఉండగా.. రూ. 9.76 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఈ నెలాఖరులోగా బకాయి మొత్తం వసూలు చేసి.. జిల్లా రికవరీని 90 శాతానికి పెంచాలని ఏపీఎం, సీసీలను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 40కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ. 22.68 కోట్లు అందించినట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీపీఓ సుధాకర్‌రెడ్డి డీఆర్డీఓ మొగులప్ప, సీ్త్రనిధి జోనల్ మేనేజర్ శ్రీనివాసులు, రీజినల్ మేనేజర్ తిరుపతయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి ఉన్నారు.
జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. నారాయణపేట మండలం లింగంపల్లి సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్ వైజర్ లక్ష్మణ్ ఉన్నారు.


