ఆస్పత్రి నిర్మాణంలో వేగం పెంచండి
● పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ
మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్/ఊట్కూర్: పట్టణంలో రూ. 48కోట్లతో చేపట్టిన 150 పడకల ఆస్పతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు అధునాతన సదుపాయాలతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో 150 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మక్తల్‌లో రూ. 3.70కోట్లతో మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ తదితర పనులు చేపడుతున్నట్లు వివరించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మక్తల్‌లోని శ్రీపడమటి ఆంజనేయస్వామి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. డిసెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలోని పురాతన కోనేరును ఆధునీకికరించడం జరిగిందని.. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీశ్‌కుమార్, విద్యుత్ ఏఈ రామకృష్ణ, ఆలయ ధర్మకర్త ప్రాణేశ్‌కుమార్, ఈఓ కవిత, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేశ్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్‌గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
● ఊట్కూర్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మినీ స్టేడియానికి మూడెకరాల స్థలం అవసరమని.. పోలీసు క్వార్టర్స్ వద్ద ఉన్న స్థలాన్ని సర్వే చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మంత్రి వెంట ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ కిషోర్, పీఆర్ ఏఈ అజయ్‌రెడ్డి, నాయకులు మణెమ్మ, బాల్‌రెడ్డి, ఎల్కోటి నారాయణరెడ్డి, భాస్కర్, అరవింద్ కుమార్, సూర్యప్రకాశ్‌రెడ్డి, యఘ్నేశ్వర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి ఉన్నారు.


