సరిహద్దులో పటిష్ట నిఘా: ఎస్పీ
కృష్ణా: కర్ణాటక నుంచి నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా ఏర్పాటుచేసినట్లు ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం రాత్రి 10 నుంచి గురువారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా చెక్‌పోస్టులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, 8మంది ఎస్‌ఐలు, 65మంది పోలీసులతో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా 367 వాహనాలను తనిఖీ చేయగా.. రెండు వరిధాన్యం బస్తాల లారీలు, ఒక ఇసుక లారీతో పాటు 200 లీటర్ల డీజిల్‌ను అక్రమంగా తరలిస్తున్న ట్యాంకర్‌ను పట్టుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘాతో పాటు నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వరిధాన్యం, ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వాహనాల తనిఖీల్లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐలు రాంలాల్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


