రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మాగనూర్/కృష్ణా: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మాగనూర్ మండలంలోని అమ్మపల్లి, వడ్వాట్, అడవిసత్యావార్, కృష్ణా మండలంలోని గుడెబల్లూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అడవిసత్యావారంలో ఒక కొనుగోలు కేంద్రంలో కొంత ఇబ్బందిగా ఉందని.. మరో సబ్ కేంద్రం ఏర్పాటు చేయించాలని కలెక్టర్‌ను కోరారు. అందుకు స్పందించిన కలెక్టర్.. ఐకేపీ ఆధ్వర్యంలో సబ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసే విధంగా చూస్తామన్నారు. వరికోతలు వేగంగా కొనసాగుతున్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు సిద్ధంగా ఉండాలన్నారు. ము ఖ్యంగా గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 45 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. కాగా, ధాన్యం డబ్బులతో పాటు బోనస్ కూడా అందించాలని పలువురు కోరగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదే విధంగా హిందూపూర్‌కు చెందిన ఓ రైతు ధాన్యం విక్రయించి 18 రోజులైనా డబ్బులు అందలేదని.. సరైన సమయానికి లారీలు అందుబాటులో ఉండటం లేదని.. రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని దించుకునేందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తెలిపారు.
మెరుగైన ఫలితాలు సాధించాలి..
మక్తల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మక్తల్‌లోని బీసీ బాలుర గురుకులంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. వి ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీను, సివి ల్ సప్లయ్ డీఎం సైదులు, తహసీల్దార్లు శ్రీనివాస్, సతీశ్‌కుమార్, సురేశ్, ఏఓ సుదర్శన్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఏపీఎం బస్వరాజ్ ఉన్నారు.


