రాయితీ పరికరాలు ఎప్పుడో?
వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతుల ఎదురుచూపులు
● జిల్లాకు 2,822 యూనిట్ల కేటాయింపు
● 435 మంది దరఖాస్తు
మరికల్: ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి.. ఈ యాసంగి నుంచే రైతులకు అవసరమైన యంత్రాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం రైతులు వానాకాలం పంట కోతలు చేపడుతూ.. యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే యంత్ర పరికరాల జాడ మాత్రం లేకుండా పోయింది. రాయితీపై అందించే యంత్రాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2025–26 సంవత్సరానికి గాను జిల్లాకు వ్యవసాయశాఖ 2,822 యూనిట్లు కేటాయించింది. ఐదెకరాలలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్న, సన్నకారు రైతులకు 50శాతం రాయితీతో.. పెద్దకారు రైతులకు 40శాతం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నారు. ఈ పథకంతో కూలీల సమస్య తీరనుంది.
జిల్లాలో ఇలా..
రాయితీ పరికరాలను అత్యధికంగా మక్తల్ మండలానికి కేటాయించారు. ఆ తర్వాత ఊట్కూరు, కృష్ణా, మాగనూర్ మండలాలకు కేటాయించగా.. అత్యల్పంగా కొత్తపల్లి మండలానికి 88 మాత్రమే కేటాయించారు. యంత్ర పరికరాల్లో బ్యాటరీ చేతి పంపులు, పవర్ స్ప్రెయర్స్, రోటవేటర్స్, బ్రస్ కటర్, కల్టీవేటర్, స్ట్రాబేలర్, తదితర పరికరాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 534 యూనిట్లు, మిగిలిన 2,088 యూనిట్లను జనరల్ కేటగిరీ కింద పంపిణీ చేయనున్నారు.
ఆగస్టులో దరఖాస్తులు..
వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు అన్ని వివరాలతో కూడిన దరఖాస్తులను గత ఆగస్టులో వ్యవసాయ విస్తరణాధికరులకు అందజేశారు. మొత్తం 2,822 యూనిట్లకు గాను 435 దరఖాస్తులు చేసుకున్నారు. అయితే యాసంగిలోనే రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందించాల్సి ఉంది. ఈ క్రమంలోనే దరఖాస్తుదారులు కొందరు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేయలేదు. ప్రస్తుతం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. యంత్ర పరికరాలు అందించకుండా జాప్యం చేస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో రైతులకు యంత్ర పరికరాలను అందించాలని కోరుతున్నారు.
త్వరలో అందజేస్తాం..
రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అర్హులైన రైతులకుఅందజేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పరికరాలతో వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– జాన్ సుధాకార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


