ప్రజావాణికి 27 అర్జీలు
నారాయణపేట టౌన్: వివిధ సమస్యలపై ప్రజావాణిలో సమర్పించిన అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. మొత్తం 27 అర్జీలు అందగా.. పరిష్కారం నమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక లోక్‌అదాలత్‌ను వినియోగించుకోండి
నారాయణపేట టౌన్: జిల్లాలోని న్యాయస్థానాల్లో ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డా.వినీత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరుపక్షాల సమ్మతితో కేసులను త్వరగా పరిష్కరించేందుకు చక్కటి వేదిక లోక్‌అదాలత్ అని.. రాజీ చేసుకునే అవకాశం ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, వైవాహిక, కుటుంబ సమస్యలు, డ్రంకెన్ డ్రైవ్, మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన, చెక్‌బౌన్స్, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ ప్రత్యేక అవకాశాన్ని ప్రతి కక్షదారు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో రాజీ పడదగిన కేసులను గుర్తించి.. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ కేసులను రాజీ చేసుకునే వారు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు.
అక్రమాలకు
పాల్పడితే చర్యలు
ఊట్కూర్: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. సోమవారం ఊట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిషోర్ సమక్షంలో ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ 14వ విడత ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. మండలంలోని 27 గ్రామాల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ. 4.37కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు వివరించారు. చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, తిప్రాస్‌పల్లి, కొల్లూర్ తరతర గ్రామాల్లో ఉపాధి హామీ పనులపై చేపట్టిన సామాజిక తనిఖీపై సమీక్షించినట్లు తెలిపారు. మిగతా గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీపై కూడా సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో విజిలెన్స్ అధికారి వినయ్ కుమార్, ఎస్‌ఆర్‌పీ కుమార్, ఏపీఓ లక్ష్మారెడ్డి, సత్యప్రకాశ్ ఉన్నారు.
ప్రజావాణికి 27 అర్జీలు


