యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం
నారాయణపేట రూరల్: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని.. తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొంతుందని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17, 19 విభాగాల బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా చేసేందుకు కొంత సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. యువత, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకొని మానసిక ఒత్తిడిని జయించాలని సూచించారు. అనంతరం జిల్లాస్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారికి డీఈఓ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్‌ఎం సురేశ్, పీడీలు సాయినాథ్, నర్సింహారెడ్డి, శ్రీధర్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
● విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రాండ్ ఉన్నత పాఠశాలలో టీ శాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీల విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, డీఎస్‌ఓ భానుప్రకాశ్, సెక్టోరియల్ అధికారులు నాగార్జున్ రెడ్డి, యాదయ్యశెట్టి, ఎంఈఓలు నిజాముద్దీన్, ఆంజనేయులు, బాలాజీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


