
‘కూటమి’ మాట.. నీటి మూట!
● సాగునీటి కాలువలను
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
● ఎన్నికల్లో హామీలను గాలికి వదిలేసిన
టీడీపీ నేతలు
● హంద్రీ–నీవా నీటి వాటాపై
గందరగోళం
● 68 చెరువులకు నీటి విడుదలకు
నిధులేవీ?
● నేడు సాగు నీటి సలహా మండలి
సమావేశం
సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
సాగునీటి వనరు విస్తీర్ణం
కేసీ కెనాల్ 3,763
ఎల్‌ఎల్‌సీ 1,51,134
ఆలూరు బ్రాంచ్ కెనాల్ 14,255
హంద్రీనీవా 60,000
జీడీపీ 24,372
చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో 27,707, లిఫ్ట్‌ల కింద
20 వేల ఎకరాల ఆయకట్టు ఉంది
కర్నూలు సిటీ: ‘ తాము అధికారంలోకి వస్తే సాగు నీటి ప్రాజెక్టులు చేపడతాం...పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..స్థీరికరించిన ఆయకట్టుకు సమృద్ధిగా సాగు నీటిని అందిస్తాం’ అని ఎన్నికల సమయంలో కూటమి నేతలు మాట ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి ఏడాది దాటినా సాగునీటి కాలువల మరమ్మతులు చేయలేకపోయారు. సాగునీటి ప్రాజెక్టులు అడుగు ముందుకు పడడం లేదు. జిల్లాలోని పశ్చిమ పల్లెల గొంతెండుతోంది. పంటలకు సాగు నీరు లేకపోవడంతో ఇప్పటికే వేలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వలస వెళ్లాయి. నేడు(సోమవారం) ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించేందుకు సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు, ఆయా సాగునీటి ప్రాజెక్టు కమిటీల చైర్మెన్లు హాజరుకానున్నారు. రైతుల కష్టాలు, ప్రజల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇవీ సమస్యలు..
● టీబీ డ్యాం గేటు గతేడాది కొట్టుకపోవడంతో జలాశయం సామర్థ్యాన్ని 105.6 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు తగ్గించారు. గతంలో ఎప్పు డూ లేని విధంగా డ్యాం నుంచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అదే నీరు తుంగభద్ర దిగువ కాలువకు విడుదల చేస్తే జిల్లాలోకి పశ్చిమ పల్లె ప్రాంతంలోని ఆయకట్టుకు ప్రయోజనం ఉంటుంది.
● ప్రస్తుతం తుంగభద్ర నదికి వరద నీరు వస్తోంది. నదీ తీరంలో ఉన్న ఎత్తిపోతల పథకాల లిఫ్ట్‌లు పనిచేయడం లేదు.
● జిల్లాలోని సాగు నీటి కాలువలు, ఎత్తిపోతల పథకాలు, మేజర్ చెరువుల తూములను ఏటా ఖరీఫ్‌కు ముందే మరమ్మతులు చేయాలి. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పైసా కూడా ఇవ్వలేదు.
● చెరువులు, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు, ఎల్‌ఎల్‌సీ నిర్వహణకు ఈ ఏడాది రూ.11.65 కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు సగం కూడా మొదలు కాలేదు. జీఎస్టీ కారణంతో టెండర్ పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.
● హంద్రీ– నీవా పరిధిలో జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది సగం ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదు. ఈ ఏడాదైనా హంద్రీ–నీవాలో జిల్లా వాటా నీరు ఎంతో కూడా స్పష్టత లేదు. మొత్తం 68 చెరవులకు నీరిచ్చేందుకు చేపట్టిన పథకం నిర్వహణకు నిధులు కేటాయింపే లేదు.
కరువు కనిపించదా?
తుంగభద్ర, హగేరి నదులపై గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడికాల్వ ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది. గుండ్రేవులపై గతేడాది అసెంబ్లీలో చర్చించినా హామీ మాత్రం ప్రభుత్వ నుంచి రాలేదు. హహగేరి నదిపై గత ప్రభుత్వం చేపట్టిన వేదావతి ప్రాజెక్టు పూర్తి కావాలంటే పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలి. గతేడాది కేటాయించిన తాత్కాలిక, ఈ ఏడాది కేటాయించిన వార్షిక బడ్జెట్‌లో పైసా నిధులు కేటాయించలేదు. ఆర్డీఎస్ కుడి కాలువ పనులకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయలేదు.