
నిర్లక్ష్యం అడ్డుకట్టగా మారి!
జూపాడుబంగ్లా: అధికారుల నిర్లక్ష్యం నీటి ప్రవాహానికి అడ్డుకట్టగా మారింది. సాగునీటి కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ‘గేట్లెత్తాం.. మా పనైపోయింది’ అన్నట్లుగా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ పర్యవేక్షణ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆదివారం హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం డ్యాంలో 878.40 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఐదో గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు 2, 4, 5, 6, గేట్లను అడుగు మేర ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 9వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం పెరిగేకొద్ది పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను పెంచే అవకాశాలున్నాయి. అయితే హెడ్‌రెగ్యులేటర్ దిగువన సమీపంలోనే నీటి ప్రవాహానికి మట్టికట్ట అడ్డుగా మారింది. పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల వరకు ఎస్సారెమ్సీ లైనింగ్ పనులను పీఎన్‌సీ కంపెనీ దక్కించుకోగా.. వారు వ్యామ్ కంపెనీ వారికి సబ్‌కాంట్రాక్టు అప్పగించారు. హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో మట్టికట్టను వేసి వేసవిలో లైనింగ్ పనులు చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు మట్టికట్టను తొలగించకపోవటంతో పోతిరెడ్డిపాడు నుంచి విడుదలయ్యే నీటిప్రవాహానికి మట్టికట్ట అడ్డంకిగా మారింది. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు తొలగించకపోవడంతో నీటి విడుదలకు హాజరైన ప్రజా ప్రతినిధులు, రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు.
వీబీఆర్‌కు చేరిన కష్ణా జలాలు
వెలుగోడు: కృష్ణా జలాలు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరాయి. ఎగువ నుంచి వరద నీరు కష్ణానదిలోకి వచ్చి చేరడంతో పోతిరెడ్డిపాడు వద్ద ఆదివారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా 5 వేల క్యూసెక్కుల నీటిని వీబీఆర్‌కు మళ్లించారు. వెలుగోడు జలాశయం గరిష్ఠ నీటిమట్టం 16.95 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.8 టీఎంసీలు ఉన్నాయి.