
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తు లు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించు కున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
మహానందిలో వైభవంగా తొలి ఏకాదశి
మహానంది: తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం మహానంది క్షేత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి గణపతిపూజ, ద్రవ్యపూజ, తిరుమంజనం, విశేష ద్రవ్యాలతో అభిషేక పూజలు జరిపించారు. మూలమూర్తులకు తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా కేవలం ఫలాలు మాత్రమే నివేదించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, పండితులు నాగేశ్వరశర్మ, హనుమంతుశర్మ తదితరులు పాల్గొన్నారు.
టీబీ డ్యాంలో
నిలకడగా ఇన్‌ఫ్లో
హొళగుంద: తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో నిలకడగా ఉండటంతో ఆదివారం 19 గేట్లతోనే నీటి విడుదల చేస్తున్నారు. జలాశయానికి 72,490 క్యూసెక్కులు (ఇన్‌ఫ్లో) వచ్చి చేరుతుండగా ఒక్కో గేటును రెండున్నర అడుగుల మేర ఎత్తి 56,333 క్యూసెక్కులు నదికి, మరో 6 వేల క్యూసెక్కులను కాలువలకు.. మొత్తం 62,444 క్యూసెక్కుల(అవుట్ ఫ్లో) నీటిని బయటకు వదులుతున్నారు. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీల కాగా.. ప్రస్తుతం 77.343 టీఎంసీల నీరు ఉంది.

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక