
పొగాకు రైతులను ఆదుకోవాలి
నంద్యాల(అర్బన్): జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు కోరారు. పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం వారు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్‌కు వినతిపత్రం పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లలో రైతులను మోసం చేసిన ప్రయివేట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ నెలఖరులోగా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోళ్లు చేస్తామని హామీ ఇచ్చిన వ్యవసాయాధికారులు మాట మార్చడం అన్యాయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇతర జిల్లాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్‌ల ద్వారా కొనుగోలు జరిపిస్తున్నారన్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక పోవడం అన్యాయమన్నారు. మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వమే రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును క్వింటా రూ. 15 వేలుతో కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నాయకులు సుబ్బరాయుడు, సురేష్ ,నరసింహ పొగాకు రైతులు వెంకటేశ్వర గౌడ్, నారాయణ, శ్రీరాములు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.