
‘ఉపాధి’లో అక్రమాలు
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని, విచారణ చేపట్టాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌లో జెడ్పీటీసీలు మౌలాలి, రామకృష్ణ, ఎంపీపీ వెంకటేశ్వరమ్మ తదితరులు జేసీ డాక్టర్ బి.నవ్యను కలసి వినతితపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని ఆరోపించారు. సర్పంచ్‌లకు తల్లికివందనం ఇవ్వాలని, ఆర్టికల్స్ 73,74 ప్రకారం పంచాయతీరాజ్ విభాగాలకు అధికారాలను బదలాయించాలని కోరారు. స్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నులను ఆయా సంస్థల ఖాతాల్లో జమచేయాలని, ఉపాధి హామీ పనులను పంచాయతీల ద్వారానే జరిపించాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలు ఇవీ..
● కర్నూలులోని వైన్ షాపుల్లో సిట్టింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి బహిరంగ విక్రయాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
● శరీన్‌నగర్ గట్టయ్యనగర్ ప్రాథమిక పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతులను అక్కడే కొనసాగించాలని జేసీకి వినతిపత్రం అందజేశారు.
● వెల్దుర్తి మండలం పుల్లగుమ్మిలో ఐరన్ ఓర్‌తో పంటపొలాలను నాశనం చేస్తున్న సీతారామయ్యపై చర్యలు తీసుకోవాలని రైతులు అర్జీ ఇచ్చారు.
● రీడిప్లాయ్‌మెంట్ పేరుతో ఎంపీహేచ్‌ఏ ఫిమేల్, సెకండ్ ఏఎన్‌ఎంలను దూర ప్రాంతాలకు కేటాయించడం అన్యాయమని, పూర్వ స్థానాలకు కేటాంచాలని కోరుతూ జేసీకి వినతిపత్రం ఇచ్చారు.
● ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కేజీబీవీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకందరికీ కేటాయించాలని అర్జీ ఇచ్చారు.
● నందవరం మండలం హలహర్వి గ్రామంలో వేలంపాటలతో 5.71 లక్షలకు దక్కించుకున్నామని, జూలై 2వ తేదీన మళ్లీ వేలం వేయడానికి నిర్ణయించారని, దానిని తమకే అప్పగించాలని యాపిలయ్య అర్జీ ఇచ్చారు.
విచారణ చేయాలని కోరిన
జెడ్పీటీసీలు