
సర్కారు భూమి భళే చవక!
నంద్యాల(అర్బన్): పచ్చ నేతలు భూ బకాసురులుగా మారుతున్నారు. అక్రమార్జనకు మరిగిన వీరు ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాత్రికిరాత్రే కబ్జా చేస్తున్నారు. ఇక ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములపై కనిపిస్తే ఇక ఊరుకుంటారా.. దర్జాగా రాళ్లు పాతి ‘రండి బాబూ రండి.. ప్లాట్లు చవక.. చవక’ అంటూ బేరం పెట్టారు. మంత్రి అనుచరులు కొందరు తలా కొంత పంచుకునేందుకు భూ దందాకు తెరలేపారు. ప్రభుత్వ భూము లను ఏకంగా విక్రయానికి పెట్టారు. నంద్యాల మండలం చాబోలు గ్రామ సమీపంలోని ఇందిరా కాలనీ వద్ద సీలింగ్ యాక్టు ప్రకారం అప్పటి ప్రభుత్వం అయ్యలూరుకు చెందిన నందిరెడ్డి రైతు వద్ద నుంచి సర్వే నెం.109/1ఏలోని 1.84 ఎకరాల సీలింగ్ ల్యాండ్‌ను అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1982లో స్థానిక పేదలకు ఇళ్ల స్థలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆ భూములు సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌కు అప్పగించింది. గ్రామానికి చివర్లో ఉండటంతో స్థలాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 2021లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ పొలాన్ని గుర్తించి ఆ భూముల్లో ఆర్‌బీకే సెంటర్, అంగన్‌వాడీ, హెల్త్ క్లీనిక్‌లతో పాటు 72 మంది లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా లాటరీ పద్ధతిలో స్థలాలను కేటాయిస్తూ బుక్‌లెట్ పత్రాలను పంపిణీ చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదంటూ తమకు ఎక్కువ ప్లాట్లు కావాలని కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అప్పటి ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే స్థలాలు అంటూ తేల్చి చెప్పడంతో కొందరు అసమ్మతి వాదులు మరికొంత మంది లబ్ధిదారులను కలుపుకొని తాత్కాలిక గుడిసెలు వేయించి కోర్టుకు వెళ్లారు. అయితే లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా ఎన్నికల కోడ్ అడ్డురావడం, ఆ తర్వాత కూటమి నేతలు అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు రద్దు అయ్యాయి.
అధికారులకు తెలిసినా చర్యల్లేవ్..
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వ ఇచ్చిన పట్టాలు రద్దు అయ్యాయి. కొత్త వారికి ఇస్తున్నామంటూ గ్రామంలో టీడీపీ నాయకులు ప్రచా రం నిర్వహించారు. సెంటు రూ.1.50 లక్షలు తీసుకొని వస్తే పట్టాతో పాటు స్థలం కేటాయిస్తామంటూ నాయ కులు బేరం పెట్టారు. దాదాపు రూ.2కోట్ల విలువ చేసే సీలింగ్ ల్యాండ్‌ను ఆక్రమించుకోవడమే కాకుండా అమ్మకాలకు పెట్టడం ఏమిటని పలువురు ప్రశ్నించా రు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు మారాయన్న ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీలింగ్ భూములను ఆక్రమించి లబ్ధిదారులకు కట్టబెట్టడంలో భారీ స్థాయిలో ముడుపులు అందడంతో పా టు అధికార పార్టీ పెద్దలు భరోసా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కూటమి నాయకులు దర్జాగా సీలింగ్ భూముల ఆక్రమణలు చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో కూటమి నేతలకు అనుకూలమైన అధికారులను రప్పించుకుని యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.
సీలింగ్ భూములు
అమ్మినా..కొన్నా చర్యలు
సీలింగ్ భూములను ఎవరూ అమ్మినా.. కొన్నా చర్యలు తప్పవు. గతంలో ఆ భూముల్లో లబ్ధిదారు ల ఎంపిక జరిగింది. ఆ భూముల అమ్మకాలు జరుగుతున్నాయ ని కొంత మంది మహిళలు మా దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అర్హులను గుర్తించి ఆ స్థలాల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశిస్తే స్థలం లేని పేదలందరి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. గతంలో ఎంపిక చేసిన వారికి సైతం ప్రాధాన్యతను ఇస్తాం. ఆ భూమి ఎవరూ అమ్మినా.. కొన్నా చట్టరీత్యా నేరమే.
– శ్రీనివాసులు, తహసీల్దార్, నంద్యాల
చాబోలులో అసైన్డ్ భూమి ఆక్రమణ
కబ్జా చేసి విక్రయిస్తున్న టీడీపీ నేతలు
సెంటు రూ.1.50 లక్షలుగా అమ్మకాలు
అదే భూమిలో గత ప్రభుత్వంలో
72 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
స్థలాలు మాకే ఇవ్వాలంటూ
పేదల ఆందోళన

సర్కారు భూమి భళే చవక!