
విత్తన దుకాణాలపై దాడులు
● రూ.21 లక్షల విలువ చేసే విత్తన
అమ్మకాలు నిలుపుదల
నంద్యాల(అర్బన్): పట్టణంలోని పలు విత్తన దుకాణాలపై గురువారం వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించారు. ఏడీఏ ఆంజనేయ, ఏఓ ప్రసాదరావుల ఆధ్వర్యంలో విజయలక్ష్మి, సాయి హిమవర్ష దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్, బిల్‌బుక్స్, విత్తన నిల్వలు, అనుమతి పత్రాలను పరిశీలించారు. రెండు దుకాణాలకు సంబంధించి దాదాపు రూ.21 లక్షల విలువైన విత్తనాలకు సరైన ధ్రువీకరణ పత్రాలు లేనందున తాత్కాలికంగా అమ్మకాలను నిలిపివేసినట్లు ఏడీఏ తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే అమ్మకాలు జరపాలని, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సార్.. తాగునీటి బావి కలుషితమవుతోంది!
పాములపాడు: సుపరిపాలన – తొలి అడుగు అంటూ గ్రామీణ ప్రాంతాలకు వస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజలు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. గురువారం బానుముక్కల, వాడాల గ్రామాల్లో పర్యటించిన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యకు పలు చోట్ల ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. బానుముక్కల గ్రామంలో అపరిశుభ్రత తాండవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చెరువుకట్ట బావి వద్ద వర్షపు నీరు నిలిచి అపరిశుభ్రంగా మారుతుందన్నారు. ఆ నీరంతా బావిలోకి చేరి నీరు కలుషితమవు తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆ బావి చుట్టు పక్కల 100 కుటుంబాలున్నాయని, వెంటనే మంచినీటి సౌకర్యం, నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.
26న రెడ్‌క్రాస్ జిల్లా సమావేశం
నంద్యాల(వ్యవసాయం): జిల్లా రెడ్‌క్రాస్ సాధారణ సమావేశం ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక పీజీఆర్‌ఎస్ భవనంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, ప్యాట్రన్‌లు, వైస్ ప్యాట్రన్లు, అసోసియేట్ సభ్యుల సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సొసైటీ మూడు సంవత్సరాల ఆడిట్ నివేదిక, నూతన కార్యనిర్వాహక కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు.
డోన్‌లో ఐదు డెంగీ కేసులు
డోన్ టౌన్: పారిశుద్ధ్యం లోపించి డోన్‌లో ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని 1, 16వ సచివాలయం పరిధిలో ఇద్దరు వ్యక్తులతో పాటు ముగ్గురు చిన్నారులు డెంగీ జ్వరం బారిన పడ్డారు. స్థానిక శ్రీనివాస నగర్‌లో ఒకే ఇంటిలో ముగ్గరు చిన్నారులతో పాటు, ఓ వ్యక్తి, శ్రీనివాస థియేటర్ సమీపంలో ఒక ఇంటిలో మకొకరికి తీవ్రంగా జ్వరం ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి డెంగీ సోకినట్లు వైద్యులు నిర్ధారించారని మలేరియా డోన్ యూనిట్ అధికారి రాజశేఖర్‌రెడ్డి ధ్రువీకరించారు. పట్టణంలో పారిశుద్ధ్యంలో లోపించి వ్యాధులు ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇళ్ల మధ్య మురుగు కూపాలు ఉన్నా తొలగించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
కర్నూలు అర్బన్ బ్యాంక్ సీఈఓ తొలగింపు
కర్నూలు(అగ్రికల్చర్): ది కర్నూలు అర్బన్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈఓగా పనిచేస్తున్న ఎస్‌ఏ రఫీక్‌ను విధుల నుంచి తొలగించినట్లు అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ చైర్మన్ నాగరమణయ్య తెలిపారు. ఈ నెల 2వ తేదీన సాక్షి దినపత్రికలో ‘రూ.2.42 కోట్ల ప్రజాధనం స్వాహా’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన సెక్షన్ 51 విచారణలో ఎస్‌ఏ రఫీక్ పేరు కూడా ఉన్నందున విధుల నుంచి పూర్తిగా తొలగించినట్లు నాగరమణయ్య తెలిపారు. సంఘంలోని సభ్యులు, డైలీ డిపాజిట్ చేసే వారు.. ఇతరులు ఎవ్వరైన ఈయనకు ఎలాంటి నగదు చెల్లించవద్దని సూచించారు.
శ్రీమఠంలో ప్రత్యేక క్యూలైన్
మంత్రాలయం: శ్రీమఠంలో సర్వదర్శనాలకు గురువారం ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. సెక్యురిటీ గార్డులు, ఇతర సిబ్బంది క్యూలైన్ల దరి దాపుల్లోకి రాకుండా అధికారులే ప్రత్యక్ష పర్యవేక్షణకు దిగారు. మఠం ప్రధాన ముఖ ద్వారం ముంగిట కారిడార్‌లో స్టాఫర్లతో క్యూలైన్ విధానం అమల్లోకి తెచ్చారు. మఠం మేనేజర్లు, సూపరింటెండెంట్స్ పర్యవేక్షణలో దర్శనాలకు అనుమతించారు. ఇక సేవా భక్తులు, గ్రామ భక్తులకు మాత్రం 6,7 నంబర్ల గేట్ల క్యూలైన్లలో దర్శనాల కు అవకాశం కల్పించారు. భక్తులు ఎవ్వరూ మోసపోకుండా ఉండేందుకు ఈ విధానం దోహ దపడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.