
చట్ట పరిధిలో ఫిర్యాదులకు సత్వర న్యాయం
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన చట్ట పరిధిలో ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పీఆర్‌ఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో 160 వినతులు వచ్చాయని, వీటిని పరిష్కరించేందుకు ఆయా స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వినతులు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.
వినతుల్లో కొన్ని..
● పాణ్యం మండలం తమ్మరాజులపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య, గురువయ్య, తదితర రైతులు 2024లో బేయర్ కంపెనీకి చెందిన మొక్కజొన్న సీడ్ విత్తనాలు సాగు చేశారు. క్వింటాల్‌కు రూ.3,500 ప్రకారం కొనుగోలు చేస్తామని, నష్టం వస్తే రూ.80 వేల వరకు పరిహారం ఇస్తామని ఏజెంట్లు నమ్మించారు. పంట నష్టం జరగడంతో కంపెనీ యాజమాన్యాన్ని నష్టపరిహారం ఇవ్వమని అడగగా కొన్ని నెలలుగా తిప్పుకుంటున్నారని, నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.
● అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిన్న రవి రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.14 లక్షలు తీసుకొని మోసం చేశాడని, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల మండలం కంబవారిపల్లె గ్రామానికి చెందిన శంకర్‌నారాయణ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
● గత 60 సంవత్సరాలుగా చంద్రపాల్ పొలం మీదుగా ఉన్న రస్తాలో మా పొలానికి వెళ్తున్నానని, ఈ ఏడాది నుంచి అతని పొలం మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన బండిస్వామిదాసు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ