
డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
నంద్యాల(న్యూటౌన్): ప్రజలు, యువత సహకారంతో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్థాయిలో మాదకద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కలిగిస్తున్నామన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేకంగా సూచనలు, వీడియోలు ప్రదర్శించాలన్నారు. అదే విధంగా నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
● ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువత వివిధ రకాల నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్నారు. గతంలో కూడా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో‘ అనే నినాదాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశామన్నారు. ముఖ్యంగా జిల్లాలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామన్నారు. వీరి సహకారంతో 39 కేజీల గంజాయి సీజ్ చేయడంతో పాటు 53 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనపరులకు ప్రభుత్వ ఆసుపత్రిలో రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
● అనంతరం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్పీజీ మైదానం నుండి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీని కలెక్టర్, ఎస్పీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీజీ మైదానం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లి తిరిగి ఎస్పీజీ మైదానం చేరుకుంది. అక్కడే మానవహారాన్ని నిర్వహించి పాల్గొన్న అందరితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మున్సిపల్ కమీషనర్ శేషన్న, పోలీస్ శాఖ డిఎస్పీలు, ఎస్సైలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల రవాణాపై 1972కు
సమాచారం ఇవ్వండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి

డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం