
ప్రాధాన్య భవనాలకు చంద్ర గ్రహణం
● గ్రామ సచివాలయాల నిర్మాణాలను
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
● అందుబాటులోకి రాని
హెల్త్‌క్లినిక్ భవనాలు
● నిర్మాణాలు పూర్తికాక ప్రజల అవస్థలు
గోస్పాడు: ప్రాధాన్యత భవనాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామస్థాయిలోనే సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. రేషన్‌తో సహా అన్ని సేవలు ఇంటి వద్దకే అందుబాటులోకి తీసుకొచ్చింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలుకొని అన్ని రకాల సేవలను గ్రామంలో అందించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత భవనాలను వినియోగంలోకి తీసుకురాలేకపోతోంది.
ఏడాది అవుతున్నా..
నంద్యాల జిల్లాలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లన్నింటికీ కలిపి 1,077 భవనాలు మంజూరయ్యాయి. వాటిలో 644 భవనాలు ఆయా శాఖల అధికారులకు అప్పజెప్పారు. మొత్తం 369 భవనాల నిర్మాణాల వివిధ దశల్లో నిలిచిపోయాయి. వివిధ కారణాలతో మరో 64 భవనాల పనులు మొదలు కాలేదు. భవనాల నిర్మాణాలకు రూ.308.91 కోట్ల అంచనా కాగా అందులో రూ. 200 కోట్ల నిధులను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ. 15.45 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పనులు పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం ముగుస్తున్నా సచివాలయ, ఆర్బీకే, హెల్త్‌క్లినిక్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయింది.
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. భవనాల పనులు ఎక్కడిక్కడ నిలిచినా వాటిని పట్టించుకోవడం లేదు. భవనాలు ప్రారంభం కాకపోవడంతో గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో గతంలో 411 సచివాలయ భవనాలు మంజూరు కాగా, 288 భవనాలు పూర్తి చేశారు. రూ. 164.31 కోట్లకు గాను రూ.121.78 కోట్లతో పూర్తి చేశారు. మిగిలిన113 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పది చోట్ల భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
ఇదీ దుస్థితి..
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 393 రైతుభరోసా కేంద్రాలు మంజూరు కాగా 228 భవనాలు పూర్తి చేశారు. మిగిలిన 139 భవనాల పనులు ప్రారంభమైనా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే 26 భవనాలు ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 273 హెల్త్ క్లినిక్‌లు మంజూరు కాగా రూ.52.94 కోట్లతో ప్రారంభించారు. మొత్తం 128 హెల్త్ క్లినిక్‌లకు రూ. 33.60 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశారు. వీటిలో 117భవనాలు వివిధ దశల్లో పనులు జరుగుతూ నిలిచి పోయాయి. అలాగే 28 భవనాల పనులు ప్రారంభం కాలేదు. నేటికీ పలు కారణాలతో నిర్మాణాలను పట్టించుకోని పరిస్థితి నెలకొంది. భవనాలు వివిధ దశల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చుచేసినా ప్రస్తుత కూటమిప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.
నిర్వీర్యం చేసే ప్రయత్నాలు
ఒక్కొక్క గ్రామ సచివాలయం ద్వారా దాదాపుగా 545 రకాల సేవలను అందించేలా అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేవారు. 2019 ముందు వరకు వాటి కోసం మండల కేంద్రాలకు వెళ్తూ , రైతులు బారులు తీరడం, వేచిచూడాల్సిన పరిస్థితితో పాటు ఎన్నో వ్యయప్రయాసలు పడుతుండేవారు. వాటన్నింటికి రైతుభరోసా కేంద్రాల ద్వారా పరిష్కారం లభించింది. ధాన్యం కొనుగొలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే నిర్వహించారు. గ్రామస్థాయిలోనే ప్రజలకు పనులు జరిగేలా చేసిన కార్యక్రమాలన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ప్రాధాన్య భవనాలకు చంద్ర గ్రహణం