
ఎవరికి చెప్పుకోవాలో..!
● అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పత్తికొండ: కూటమి ప్రభుత్వంలో అధికారు ల పర్యవేక్షణ లేకపోవడతో సచివాలయ సిబ్బంది ఆడిందే ఆట పాడిండే పాటలా తయారైంది. వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియడం లేదు. దీంతో వివిధ సమస్యలపై వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెనుదిరుగుతున్నారు. పత్తికొండ మండలంలో 14 జిల్లా పరిషత్, బేసిక్ ఫ్రైమరీ, ప్రైమరీ పాఠశాలలు మొత్తం 45 దాకా ఉన్నాయి. దాదాపు 14వేలు మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. అందులో ఈసారి 12,468 విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రకటించి 546 మంది విద్యార్థులను అనర్హుల జాబితాలో చేర్చారు. వీరికి ఈనెల 20వ తేదీలోపు సచివాలయాల్లో గ్రివెన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో అనర్హుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లులు మంగళవారం సచివాలయాలకు తరలి రాగా అక్కడ ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సచివాలయాలు తెరిచి ఉంచిన సిబ్బంది అందుబాటులో లేకుండాపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి వస్తున్నా సచివాలయాల్లో ఎవరూ ఉండటం లేదని పలువురు ఆరోపించారు.