విశాఖలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్

సినీ దర్శకుడు పరశురాం
సీతమ్మధార(విశాఖ ఉత్తర): సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం రెండు షెడ్యూళ్లను పూర్తి చేశామని, కరోనా తగ్గగానే విశాఖలో మరో షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని ఆ చిత్ర దర్శకుడు పెట్ల పరశురాం వెల్లడించారు. నగరంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నాతవరం మండలం చెర్లోపాలెం తన సొంత గ్రామమని, ఏయూలో ఏంబీఏ పూర్తి చేసి చిత్ర పరిశ్రమకు వెళ్లానని చెప్పారు. విశాఖలో ‘సర్కారు వారి పాట’ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తానని చెప్పారు. సినిమా షూటింగ్‌లకు విశాఖ అనుకూలమన్నారు.
రుషికొండ, ఆర్కే బీచ్, కైలాసగిరి, భీమిలి బీచ్, అరకులోయ తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు యువత, ఆంజనేయులు, గీతగోవిందం, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలకు దర్శకత్వం వహించినట్టు తెలిపారు. నటుడు రవిప్రకాష్ తనకు మంచి స్నేహితుడన్నారు. రవిప్రకాష్ మాట్లాడుతూ విశాఖ వ్యాలీ స్కూల్‌లో 12వ తరగతి వరకు చదువుకున్నానని, రష్యాలో మెడిసిన్ పూర్తి చేసినట్టు చెప్పారు. సుమారు 200 చిత్రాల్లో నటించానని, ఎలాంటి పాత్రనైనా సవాల్‌గా తీసుకుని నటిస్తానన్నారు.
ఎలక్ట్రిక్ వెహికల్ షోరూం ప్రారంభం
గురుద్వారాలో శుక్రవారం హరికృష్ణ ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ కమర్షియల్ వెహికల్ షోరూంను ముఖ్య అతిథి ఫిల్మ్ డైరెక్టెర్ పెట్ల పరశురాం, నటుడు డా.రవిప్రకాష్‌లు ప్రారంభించి, మాట్లాడారు. పర్యావరణానికి మేలు చేసేలా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయన్నారు. తన స్నేహితుడి షోరూం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గౌరవ అతిథి ఒమె గా ప్రైవేట్ లిమెటెడ్ చైర్మన్ ఉదయ్ నారంగ్, బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ పరశురాంరాజు, సంస్థ పార్ట్‌నర్ హరికుమార్, గంట అనిత పాల్గొన్నారు.