
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, శృతిహాసన్ కీలక పాత్రలు పోషించారు.
అయితే తాజాగా తలైవాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. రజినీకాంత్ తన ఫ్యాన్స్తో మలేసియాలో మీట్ అవుతున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ పేరుతో ఈ ప్రచారం జరుగుతోంది. దీనిపై రజినీకాంత్ ప్రతినిధులు స్పందించారు. మలేసియాలో ఫ్యాన్స్ గ్రీట్ అండ్ మీట్ లాంటివీ తాము నిర్వహించడం లేదన్నారు. అలాంటి వాటిని నమ్మి అభిమానులు మోసపోవద్దని రజినీకాంత్ టీమ్ హెచ్చరించింది. ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.
రజినీకాంత్ టీమ్ లేఖలో రాస్తూ.. "ప్రియమైన అభిమానుంలదరికీ.. ప్రస్తుతం మాలిక్ స్ట్రీమ్స్ ప్రమోట్ చేస్తున్న 'మీట్ అండ్ గ్రీట్ తలైవార్' అనేది పూర్తిగా అనధికారిక ప్రకటన. ఇలాంటి ఫేక్ ప్రకటనలు ఎటువంటి ముందస్తు అనుమతి పొందకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఫేక్ వాటిపట్ల అభిమానులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటితో అభిమానులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. తప్పుడు ప్రకటనలు నమ్మి ఎవరు కూడా పాల్గొనవద్దని అభిమానులను, ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాం' అని ప్రకటన విడుదల చేశారు.