
నిజాలు చేదుగా ఉంటాయన్న సామెత ఉండనే ఉంది. అలా కొందరు వాస్తవాలను అంగీకరించలేరు కదా ప్రశంసలను కూడా స్వాగతించలేరు. నటి కాజల్ అగర్వాల్ ప్రవర్తన కూడా ఇలానే ఉంది. ఈ భామ తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన విషయం తెలిసిందే. కొన్ని ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా పెద్దగా ఫలితం దక్కలేదు. అదే సమయంలో మార్కెట్ కూడా పడిపోయింది. దీంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అలా 2020లో 'గౌతమ్ కిచ్లూ' అనే వ్యక్తిని వివాహమాడారు. వీరికి 'నీల్ కిచ్లూ' అనే కొడుకు ఉన్నాడు. పెళ్లి తర్వాత కొద్ది కాలమే నటనను కొనసాగించిన కాజల్ అగర్వాల్‌కు సరైన హిట్స్ అవకాశాలు రాకపోవడంతో ఖాళీగానే ఉన్నారు.

అదే సమయంలో కాస్త బరువు కూడా పెరిగారు. ఈమెకు కథానాయిక అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాజల్ అగర్వాల్ కమలహాసన్‌తో కలిసి నటించిన ఇండియన్ – 3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 40 ఏళ్ల ఈ పరువాల భామ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అందుకోసం గట్టిగా కసరత్తు చేసి, బరువు తగ్గి అందంగా తయారయ్యారు. దీంతో పలువురు నాలుగు పదులు వయసు దాటినా మళ్లీ సినిమాలో నటించడానికి సిద్ధమైన కాజల్ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక్కడే ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం విశేషం. ఆమె రీఎంట్రీకి అందుతున్న శుభాకాంక్షలకు సంతోషపడకుండా 40 అని తన వయసును ప్రస్తావించడం జీర్ణించుకోలేకుంది. దీంతో 40 ఏళ్లు నిండితే అంతా ముగిసిపోయిందని అర్థం కాదనీ, అయినా ప్రతిభకు వయసు ఆటంకం కాదనీ, ఇకపై వయసు గురించి ఎవరు మాట్లాడవద్దు అని నటి కాజల్ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిజాలను అంగీకరించడానికి కాజల్ అగర్వాల్ ఎందుకింత అసహనం అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.