పది రోజుల్లో క్లోజ్‌.. రెండు రోజులకే ఇలా.. బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది? | Bigg Boss Kannada 12 Studio Reopened After 2 Days | Sakshi
Sakshi News home page

Bigg Boss: రెండు రోజులకే మళ్లీ ఇలా.. బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది?

Oct 9 2025 7:51 PM | Updated on Oct 9 2025 7:58 PM

Bigg Boss Kannada 12 Studio Reopened After 2 Days

ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ హవా నడుస్తోంది. తెలుగులో మొదలైన ఈ షో ఆ తర్వాత తమిళం, కన్నడలోనూ ప్రారంభమైంది. కన్నడ హీరో సుదీప్ బిగ్‌బాస్ 12వ సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబరు 28న ఆదివారంతో మొదలైన షో పట్టుమని పది రోజులకే మూసేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం స్థానిక పర్యావరణ అధికారులే. జాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లోని బిగ్‌బాస్ హౌస్ సెట్ వ్యర్థాలన్నీ బయటికి వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ షో  నిర్వాహకులకు పర్యావరణ నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత వెంటనే బిగ్‌బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో కన్నడ బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పెద్ద షాకిచ్చారు అక్కడ అధికారులు. బిగ్‌బాస్‌ హౌస్‌కు తాళం వేసి అందరినీ బయటికి పంపించారు.

అయితే ఇది జరిగిన రెండు రోజుల్లోనే మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌ తెరుచుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదేశాలతో బిగ్‌బాస్ షోను తిరిగి ప్రారంభించారు. రెండు రోజుల అనంతరం  కంటెస్టెంట్స్‌ 17 మంది మళ్లీ హౌస్‌లోకి  తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఈ షోను తిరిగి ప్రారంభించేందుకు సహకరించిన డీసీఎం డీకే శివకుమార్‌కు హోస్ట్‌ కిచ్చా సుదీప్‌ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఇప్పటికే జాలీవుడ్ స్టూడియోస్ మూసివేతను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణకు రానుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement