పల్లెపోరు.. విందుల జోరు!
ఒక్కటవుతున్న వర్గాలు
గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి
● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ● ముగిసిన మొదటి విడత నామినేషన్లు
పంచాయతీ ఎన్నికలకు మొదటి విడత
నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో పల్లెల్లో విందుల సందడి మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో చలికాలంలో పల్లె పోరు హాట్‌హాట్‌గా మారింది.
– మెదక్‌జోన్
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి అభ్యర్థులు ఫోన్లు చేస్తూ గ్రామానికి వచ్చి ఓటు వేయాలని వేడుకుంటున్నారు. అందుకు అవసరమైన రవాణా ఖర్చుల కు డబ్బులు పంపుతున్నారు. ఉదయం నుంచి ఇంటింటికీ తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆత్మీయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఉదయం ప్రజలు పనులకు వెళ్తుండగా, సాయంత్రం సమయంలో ఓటు వేయాలని వేడు కుంటున్నారు. సాయంత్రం అయిందంటే మందు, విందు ఏర్పాటుచేస్తున్నారు. కాగా గతంలో సర్పంచ్, ఎంపీటీసీ ఇతర పదవులు నిర్వహించిన వారు మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతుండగా, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ధోరణిలో ప్రజలున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీకి చెందిన వారు ఇద్దరు బరిలో నిలుస్తున్నారు. ఒకరిని పోటీ నుంచి తప్పించేందుకు నేతలు యత్నిస్తున్నారు.
ఎత్తుకు పైఎత్తు..
సాధారణంగా గ్రామాల్లో చాలా వరకు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు వ్యక్తులు మాత్రమే పోటీపడతారు. ఎదుటి వ్యక్తి బలంగా ఉన్న చోట అతడిని ఓడించేందుకు మూడో వ్యక్తిని బరిలో దింపుతు న్నారు. ఒకవర్గం ఓట్లను చీల్చి ఆ ఇద్దరిని ఓడించేందుకు ఎత్తుగడ వేస్తునట్లు తెలిసింది. ఎన్ని జిమ్మికులు చేసైనా గెలవటమే ఏకై క లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు పార్టీల కన్నా పోటీలో నిలబడిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తూ మద్దతు పలుకుతున్నారు. ఇందులో భాగంగా కుల సంఘాలతో పాటు వర్గాలన్నీ ఒక్కటవుతున్నాయి. మంచి వ్యక్తిని ఎన్నుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నమ్మిన దేవుళ్లపై ఒట్టేసి ప్రమాణాలు చేస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. దీంతో పల్లెలన్నీ ఎన్నికల బిజీతో సందడిగా మారాయి.


