
తండ్రిని రోకలితో కొట్టి చంపిన తనయుడు
● నిర్మల్ జిల్లా రాజూరలో ఘటన
లోకేశ్వరం: తండ్రిని రోకలితో కొట్టి తనయుడు చంపాడు. నిర్మల్ జిల్లా మండలంలోని రాజూర గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ముధోల్ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. రాజూర గ్రామానికి చెందిన గన్నారం భూమన్న(80)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు భూమన్న, రెండో కుమారుడు సుదర్శన్, మూడో కుమారుడు సాయికృష్ణ. సుదర్శన్ మూడేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. సాయికృష్ణ హైదరాబాద్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. పెద్దకుమారుడు భూమన్న భార్య సునీతకు ఏడాది క్రితం గొడవల కారణంగా పుట్టింటికి నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు వెళ్లిపోయింది. రాజురాలో తనకున్న మూడెకరాల్లో పెద్దకుమారుడు వ్యవసాయంతోపాటు కూలీ పని వెళ్లి తండ్రి భూమన్నకు పోషించుకుంటున్నాడు. ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. మూడు రోజులుగా తిండి పెట్టటం లేదని తండ్రి, పెద్దకుమారుడి మధ్య గొడవ జరిగింది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశానికి లోనైన కుమారుడు రోకలితో తండ్రి తలపై కొట్టి హత్య చేశాడు. మృతుడి కుమారై సుజాత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అంతకుముందు భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ముధోల్ సీఐ మల్లేశ్, లోకేశ్వరం ఎస్సై అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

తండ్రిని రోకలితో కొట్టి చంపిన తనయుడు