
పింఛన్ ఇప్పించరూ..!
● ప్రజావాణిలో సమస్యల వెల్లువ ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్, అదనపు కలెక్టర్ ● పెండింగ్‌లో ఉంచరాదని ఆదేశాలు
వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న భీమిని మండలం చిన్నగుడిపేట వాసులు
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘‘పుట్టుకతోనే నా మనుమడి కాళ్లు చచ్చుబడిపోయాయి. తొమ్మిదేళ్లు అవుతుంది.. ఏళ్ల తరబడి పింఛన్ కోసం తిరుగుతున్న బాంచెన్. నా భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పింఛన్ రావడం లేదు.. దివ్యాంగుల పింఛన్ రావడం లేదు..’’ అంటూ భీమిని మండలం చిన్నగుడిపేటకు చెందిన మహిళలు, చిన్నారులు, వృద్ధులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు దరఖాస్తు సమర్పించి గోడు వెళ్లబోసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని, భూములు ఆక్రమించుకున్నారని, అక్రమ పట్టాలు రద్దు చేయాలని, భూ పరిహారం మంజూరు చేయాలని, ఉపాధి కల్పించాలని ఇలా అనేక సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. కలెక్టర్ కుమార్ దీపక్ అదనపు కలెక్టర్ మోతీలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణలతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
● తాండూర్ మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన కాసిపాక లక్ష్మి తన పేరిట ఇందిరమ్మ ఇల్లు జాబితాలో ఉందని, నిర్మాణానికి అనుమతించాలని కోరింది.
● దండేపల్లి మండలం పాతమామిడిపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి సత్తయ్య తన తండ్రి పేరిట గ్రామ శివారులో భూమి ఉందని, ఆయన మరణించినందున కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని, తన తల్లి పేరిట పట్టా చేయాలని కోరాడు.
● హాజీపూర్ మండలం గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసినందున ఉపాధి కల్పించాలని ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు అర్జీ సమర్పించారు.
● బెల్లంపల్లి పెద్దనపల్లి వార్డుకు చెందిన కుసనపల్లి అన్నపూర్ణ తాను ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నానని, కూలీ పని చేసే తన భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లుగా చూపించారని, విచారణ జరిపి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరింది.
రెండు కాళ్లు పనిచేయవు..
నా మనుమడు ఎగ్గ వి నోద్(9) పుట్టుకతోనే దివ్యాంగుడు. రెండు కాళ్లు పనిచేయవు. నా లుగో తరగతి చదువుతున్నాడు. ఏడాదిన్నర క్రితం 30శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. కాళ్లు చచ్చుబడి పోయి భూమి మీద నుంచి లేచి నిల్చోలేడు. తన పనులు, ఇతర ఏ పనీ చేయలేడు. ఇటువంటి వాళ్లకు పింఛన్ రాకుంటే ఎట్లా. పింఛన్ ఇప్పించాలి.
– ఎగ్గ వినోద్, నానమ్మ పోషమల్లక్క,
చిన్నగుడిపేట, భీమిని
కంటి సమస్య..
కంటి సమస్య, మరుగుజ్జుతనంతో ఏళ్ల తరబడి బాధ పడుతున్న. నా చూపు పని చేయక ఏ పనీ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న. నాకు పింఛన్ మంజూరు చేయాలి.
– ఎం.యేసన్న, గూడెం, దండేపల్లి

పింఛన్ ఇప్పించరూ..!

పింఛన్ ఇప్పించరూ..!

పింఛన్ ఇప్పించరూ..!