
బాలిక విద్యకు బాసట
● జిల్లాలో ఐదు కేజీబీవీలు అప్‌గ్రేడ్ ● వేమనపల్లి, దండేపల్లి, కన్నెపల్లి, కోటపల్లి, హాజీపూర్‌లో ఇంటర్ ప్రారంభం ● గ్రామీణ నిరుపేద విద్యార్థినులకు మేలు
కేజీబీవీ– విద్యార్థుల సంఖ్య
బెల్లంపల్లి 325
భీమారం (జైపూర్) 203
భీమిని 224
చెన్నూర్ 313
దండేపల్లి 178
హాజీపూర్ 200
జైపూర్ 320
జన్నారం 269
కన్నెపల్లి 197
కాసిపేట 184
కోటపల్లి 197
లక్షెట్టిపేట 308
మంచిర్యాల 339
మందమర్రి 287
నస్పూర్ 269
నెన్నెల 243
తాండూర్ 343
వేమనపల్లి 190
మంచిర్యాలఅర్బన్: గ్రామీణ ప్రాంత పేద కుటుంబాల బాలికలకు కళాశాల విద్యను ప్రభుత్వం చేరువ చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో ఐదు చోట్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 18కేజీబీవీలు ఉండగా ఇదివరకు పదింటిలో ఇంటర్ విద్య అమలవుతోంది. ఈ ఏడాది వేమనపల్లి, కోటపల్లి, హాజీపూర్, దండేపల్లి, కన్నెపల్లి కేజీబీవీలు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇంటర్ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గ్రూపులో 40మందికి ప్రవేశం కల్పించనున్నారు.
విద్యార్థినులకు ఎంతో మేలు
ప్రస్తుతం ఇంటర్ విద్య భారంగా మారింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలు పదో తరగతిలోనే విద్యకు స్వస్తి చెబుతున్నారు. పది కేజీబీవీల్లో మాత్రమే ఇంటర్ విద్య కొనసాగుతుండగా.. మిగతా ఎనిమిది చోట్ల ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నాయి. వీటిలో ఐదు కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభించడంతో బాలిక విద్యకు భరోసా కలుగుతోంది. అనాథలు, వెనుకబడిన వర్గాలకు సీట్లు కేటాయిస్తారు. కేజీబీవీల్లో పదో తరగతి వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ప్రచారం చేపట్టారు.
రెండు చోట్ల రెండు.. మూడు చోట్ల ఒకే కోర్సు
జిల్లాలోని కేజీబీవీల్లో 4,589మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. అప్‌గ్రేడ్ అయిన ఐదు కేజీబీవీల్లో రెండు చోట్ల రెండు కోర్సులు, మిగతా మూడు చోట్ల ఒక్కో కోర్సు నిర్వహించనున్నారు. అదనపు తరగతి గదులు లేక, ఇతర కారణాల దృష్ట్యా ఒక్కో కోర్సుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. హాజీపూర్‌లో బైపీసీ, ఎంఎల్‌టీ, కోటపల్లిలో బైపీసీ, కన్నెపల్లిలో బైపీసీ, దండేపల్లిలో ఎంఎల్‌టీ, కమర్షియల్ గార్మెంట్స్, వేమనపల్లిలో ఎంఎల్‌టీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. భీమిని, కాసిపేట, భీమారం కేజీబీవీల్లో గదుల కొరత, సౌకర్యాల లేమి కారణంగా ఇంటర్ విద్య అమలుకు నోచుకోకుండా పోయాయి.
జిల్లాలో..
జిల్లాలో ఇప్పటికే తాండూర్, జన్నారం, నెన్నెల, మందమర్రిలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, మంచిర్యాల, లక్సెట్టిపేట, జైపూర్, బెల్లంపల్లి, చెన్నూర్ కేజీబీవీల్లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అప్‌గ్రేడ్ చేస్తున్న మరో ఐదు కేజీబీవీల్లో ఇంటర్ విద్య అమలుకానుంది. ప్రతీ కోర్సుల్లో 40 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో ఐదు కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి రానుంది. గ్రామీణ నిరుపేద విద్యార్థినులకు లబ్ధి చేకూరనుంది. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్లు మొదలయ్యాయి. 15 కేజీబీవీల్లో ఇంటర్ తరగతుల నిర్వహణ సాగనుంది.
– యశోధర, సెక్టోరల్ అధికారి, మంచిర్యాల