
ఇంటర్ విద్యను బలోపేతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీ డియెట్ విద్యపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కో టపల్లి, జైపూర్, దండేపల్లి, తాండూర్ మండలాల్లో నూతన వసతిగృహాలు మంజూరైనట్లు తెలిపారు. విద్యార్థులను కళాశాలల్లో చేర్పించేందుకు అధికారులు, అధ్యాపకుల బృందం సమష్టిగా కృషి చేయాలన్నారు. 2025–26 సంవత్సరంలో అదనంగా 30శాతం విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. జూనియర్ లెక్చరర్లతో బృందాలు ఏర్పాటు చేసి వారి పరిధిలోని పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవగాహన కల్పించి కళాశాలల్లో చేర్పించాలని అన్నారు. మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, చెన్నూర్, బెల్లంపల్లి, జైపూర్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రూ.1.77లక్షల వ్యయంతో అగ్ని నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.