
అకాల వర్షాలు.. ఆగమాగం
● జిల్లాలో 13.1 మిల్లీమీటర్ల వర్షం ● చేతికందిన పంట నీటిపాలు
13.1 మిల్లీమీటర్ల వర్షం
జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు 13.1మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కన్నెపల్లి మండలంలో 34.4 మిల్లీమీటర్లు, నస్పూర్‌లో 32.6, మంచిర్యాలలో 27.4, నెన్నెలలో 25.8, భీమినిలో 19.7, కాసిపేటలో 16.9, తాండూర్‌లో 15.6, బె ల్లంపల్లిలో 15.5, దండేపల్లిలో 14.7, జైపూర్‌లో 8.7, మందమర్రిలో 6.8, భీమారంలో 5, చెన్నూర్‌లో 5.3, వేమనపల్లిలో 2.3, హాజీపూర్‌లో 2, జన్నారంలో 1.5, కోటపల్లిలో 0.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అకాల వర్షాలతో రైతులు ఆగమాగం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసుకుని ఎదురుచూస్తుండగా వర్షాలతో ధాన్యం తడిసి, కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం రాత్రి జిల్లాలోని నస్పూర్, మంచిర్యాల, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, దండేపల్లి మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి, వరద నీటిలో కొట్టుకుపోయింది. పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్ కవర్లు అందక, అద్దెకు తీసుకుని అరిగోసపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులైనా సగం కూడా ధాన్యం సేకరణ పూర్తి కాలేదు. జిల్లాలో 3.21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 99,512.480 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
కాలువ తీసి పండించిన ధాన్యం వర్షార్పణం
మంచిర్యాల సమీపంలోని సీతారాంపల్లి గ్రామ రైతులు పంటను కాపాడుకునేందుకు వేసవిలో రెండు కిలోమీటర్ల మేర గోదావరి నదిలో జేసీబీతో కాలువ తీయించారు. 200 ఎకరాల్లోని వరి పంటకు నీరందించారు. ఇందుకోసం ఒక్కో రైతు రూ.600 నుంచిరూ.1500 వరకు పోగు చేసి రూ.2లక్షలు వెచ్చించారు. ఇన్ని కష్టాలు పడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు సీతారాంపల్లి కొనుగోలు కేంద్రంలో ఆరబోసుకున్నారు. అకాల వర్షానికి నలుగురైదుగురు రైతుల వరి ధాన్యం వరద నీటిపాలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు.