
అంబేడ్కర్ మార్గం అనుసరణీయం
బెల్లంపల్లిరూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ చూపిన బాట అనుసరణీయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని చాకేపల్లి గ్రామంలో అంబేడ్కర్ స్నేహ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు హేయమైన చర్యగా మండిపడ్డారు. ప్రతీ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాలు, ఇంటింటా చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేతకాని భవన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. అంతకముందు బెల్లంపల్లి మండలంలో రూ.17.77 కోట్లతో నిర్మించిన 10 బీటీ రోడ్లు, రూ.2.45 కోట్లతో బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి చాకేపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు మరమ్మతు పనుల శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ ముడిమడుగుల శంకర్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా , డీఎఫ్‌వో శివ్ ఆశిష్‌సింగ్, డీసీపీ భాస్కర్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్, కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ సంఘం నాయకులు రాంచందర్, మహేందర్, మల్లేష్, రమేష్, రవీందర్‌రెడ్డి, కేవీ.ప్రతాప్, శంకర్, మురళీధర్ రావు, స్వామి, మల్లయ్య, సంతోష్ పాల్గొన్నారు. కాగా, మంత్రి సీతక్కకు వినతుల వెల్లువెత్తాయి. ప్రజలు, వివిధ విభాగాల సిబ్బంది తమ సమస్యల కోసం వినతిపత్రాలు అందజేశారు.
ప్రతీ గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేయాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క