
ఆదివాసీ, గిరిజనులకు శిక్షణ తరగతులు
● రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్
జన్నారం: ఆదివాసీలు, గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్యపర్చడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఇందులో భాగంగా జన్నారంలో ఆదివాసీ, గిరిజన నాయకులకు మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన ఆదివాసీ, గిరిజనుల కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణ తరగతుల కార్యక్రమం ఈ నెల 11, 12, 13వ తేదీల్లో మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఏర్పాట్లను గురువారం వారు పరిశీలించారు. శిక్షణ తరగతుల ప్రారంభానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి ఆత్రం సుగుణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్, పార్టీ సీనియర్ నేతలు గుర్రం మోహన్‌రెడ్డి, సయ్యద్ ఇసాక్, ఆర్.రమేష్‌రావు, ఇందయ్య, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.