మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో తొలి రోజు శుక్రవారం గందరగోళం ఏర్పడింది. ఓ పేపర్ ప్రశ్నపత్రాల బాక్స్‌కు బదులు మరో పేపర్ బాక్స్ తీసుకు రావడంతో రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష మొదలైంది. ఈ సంఘటన మినహా జిల్లాలోని మిగతా 48 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 9,183 మంది విద్యార్థులకు గాను 9,163మంది పరీక్షకు హాజరయ్యారు. నిర్ధేశిత సమయానికి ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించారు. విద్యార్థులు చేతి గడియారాలు వెంట తెచ్చుకోగా.. కొన్నిచోట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల సిబ్బందితోపాటు తనిఖీలకు వచ్చిన స్క్వాడ్ సెల్‌ఫోన్లు కూడా బయటనే ఉంచారు.
ఇక్కడ గందరగోళం..
జిల్లా కేంద్రం మంచిర్యాలలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో సంబంధిత అధికారులు తెలుగు పేపర్ బాక్స్‌కు బదులు హిందీ పేపర్ బాక్స్ తీసుకు రావడంతో గందరగోళానికి దారి తీసింది. ఈ నెల 10న హైదరాబాద్ నుంచి కాటన్ బాక్స్‌లో ప్రశ్నపత్రాలు డీఈవో కార్యాలయానికి చేరగా రూట్ అధికారులతో పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆయా పోలీసుస్టేషన్లలో సీఎస్, కస్టోడియన్, డీవోల సమక్షంలో ట్రంక్ బాక్స్‌లో ప్రశ్నపత్రాలు భద్రపర్చారు. మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంకు సంబంధించిన డే–1 ప్రశ్నపత్రం తీసుకు రావాల్సి ఉండగా డే–2 ప్రశ్నపత్రం పార్సిల్ తీసుకొచ్చారు. వెంటనే పొరపాటును గుర్తించిన సీఎస్, డీవోలు పార్సిల్ తెరవకుండానే జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్‌కు సమాచారం అందించారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో యాదయ్య పరీక్ష కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. పేపరు పార్సిల్ మారిన విషయం ఉన్నతాధికారులకు తెలియజేసి తెలుగు ప్రశ్నపత్రం పార్సిల్ మార్చే క్రమంలో సమయం గడిచిపోయింది. ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.30 గంటలకు ప్రారంభమైంది. ప్రశ్నపత్రంపై విద్యార్థులు ప్రశ్నించగా.. తెలుగు పేపర్‌లో ఎర్రర్ వచ్చిదంటూ ఇన్విజిలేటర్లు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. పరీక్ష ఆలస్యం కావడంతో స్నాక్స్, తాగునీరు అందించారు. పరీక్ష సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించారు. పరీక్ష ముగిసే సమయం 12.30గంటలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. మరో పశ్నపత్రం తీసుకు రావడం, మార్చడానికి ఆలస్యమైందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఎండల నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. పది పరీక్ష కేంద్రాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్నం తరగతులు కొనసాగుతున్నాయి. ఈ పరీక్ష కేంద్రంలో ఆలస్యం కావడంతో విద్యార్థులకు సెలవు ప్రకటించారు.