విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: దేవరకద్ర గురుకుల మైనారిటీ జూనియర్ కళాశాల (బాలుర–1)లో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్న నవీన్‌కుమార్ (16) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని తల్లిదండ్రులు ఆది లావణ్య, విష్ణువర్ధన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నవంబర్ 9న నవీన్‌కుమార్ ఐదుగురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. వెతకగా చివరకు తమ కుమారుడి మృతదేహం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల శివారులోని కాల్వలో కనిపించిందన్నారు. అతనికి ఈత వచ్చని, మిగతా నలుగురు స్నేహితులపై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. నవీన్‌కుమార్ తండ్రికి కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నల్లవెల్లి కురుమూర్తి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్ డిమాండ్ చేశారు.


