ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్థి మృతి
మిడ్జిల్: ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మిడ్జిల్‌కు చెందిన శ్రీశాంత్ (17) ట్రాక్టర్ నడుపుకుంటూ ఇంటికి వస్తుండగా కొత్తూర్ రోడ్డు సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యువకుడికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుని తండ్రి శ్రీనువాసులు ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు.
రైలుకింద పడి
యువకుడి దుర్మరణం
జడ్చర్ల: జడ్చర్ల రైల్వేస్టేషన్ పరిధిలో ఆలూరు రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి(28) ఆదివారం రైలు కిందపడి దుర్మరణం చెందాడు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారీపడి మృతిచెంది ఉంటాడని రైల్వేపోలీసులు భావిస్తున్నారు. చొక్కా కాలర్‌పై మార్స్ టైలర్స్, కుడిచేతిపై ఓం, మెడపై త్రిశూలం పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా నలుపు రంగు షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించినవారు 8712658597 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
నీటిగుంతలో
పడి వ్యక్తి మృతి
జడ్చర్ల: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం.. పెద్దపల్లికి చెందిన కాగుల కేశవులుకు ఆదే గ్రామానికి చెందిన యశోదతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి బాబు(14) ఉన్నాడు. కేశవులు తాగుడుకు బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె 8 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. ఆదివారం పెద్దపల్లిలో ఒంటరిగా ఉంటున్న కేశవులు(40) తన ఇంటి ముందున్న నీటి గుంతలో పడి మృతి చెందాడు. తన భర్త తాగిన మైకంలో నీటి గుంతలో పడి మృతి చెందాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లేశ్ తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్త
ఆత్మహత్యాయత్నం
కందనూలు: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త బంగారయ్య సర్పంచ్ టికెట్ తనకు కాకుండా గ్రామంలోని మరో వ్యక్తికి కేటాయిస్తున్నారని, మనస్థాపానికి గురై క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తున్న వ్యక్తిని కాదని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో నిరాశ చెందినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కార్యకర్తలు గమనించి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
రెండు ఇళ్లలో చోరీ
ఉప్పునుంతల: మండలంలోని కొరటికల్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు విరుగొట్టి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సతీష్‌రెడ్డి ఇంటి తాళం విరుగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలో రూ.5వేల నగదుతో పాటు రెండు తులాల వెండి వస్తువులు తీసుకెళ్లారు. పక్కనే ఉన్న సుధాకర్‌రెడ్డి ఇంటి తాళాలు విరుగొట్టి ఇంట్లో ఉన్న రూ.11 వేల నగదు, 15 తులాల వెండి వస్తువులు దోచుకెళ్లారు. బాధితులు పని నిమిత్తం ఇండ్లకు తాళాలు వేసి హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. పరిసర ప్రాంతంలో ఉన్న ఇళ్ల వారు ఉదయం ఇది గమనించి వారికి సమాచారం అందించారు. చోరీలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.
మొర్రం ట్రాక్టర్లు సీజ్
హన్వాడ: మండల కేంద్రంలో శివారు నుంచి అక్రమంగా మొర్రం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కలెక్టర్ విజయేందిర సీజ్ చేయించారు. ఆదివారం నామినేషన్ కేంద్రాల పరిశీలన నిమిత్తం వెళ్తున్న కలెక్టర్ మొరం ట్రాక్టర్లను చూసి ఆరా తీశారు. అక్రమంగా తరలిస్తున్నారన్న విషయం గుర్తించిన కలెక్టర్ ఆ ట్రాక్టర్లను సీజ్ చేశారు. స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్‌కి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్థి మృతి


