
టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం
మరికల్: టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము కథనం మేరకు.. ధన్వాడ మండలం కంసాన్‌పల్లికి చెందిన కొల్లంపల్లి ఉప్పరి నారాయణ (48) పెద్దచింతకుంట నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మరికల్ చౌరస్తాలో బైక్‌ను మలుపుతుండగా ఒడిస్సా నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న టిప్పర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొని ఆయన తలపై నుంచి టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నారాయణ రియల్ వ్యాపారం చేస్తుండటంతో ఆయన బైక్‌లో విలువైన డాక్యుమెంట్లు, రూ.లక్ష నగదు ఉండటంతో పోలీసులు వాటిని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
బైక్ అదుపుతప్పి
మరొకరు మృతి
వెల్దండ: మండలంలోని బైరాపూర్ సమీపంలో వెల్దండ–చారకొండ రహదారిపై బైక్ అదుపుతప్పి భూత్కురి రమేశ్ (30) మృతి చెందినట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. కొట్ర గ్రామానికి చెందిన రమేశ్ బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోగా ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆదివారం రోడ్డు పక్కన గుంతలో బైక్, వ్యక్తిని గుర్తించిన బైరాపూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్‌ఐ వివరాలు సేకరించగా కొట్ర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ వివరించారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతూ ఏఎస్‌ఐ మృతి
మానవపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఎస్‌ఐ సమద్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఏఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఏఎస్‌ఐ సమద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్‌లో విధులు నిర్వర్తించేవాడు. గత నెల 27న విధులు ముగించుకొని తిరిగి వస్తూ మానవపాడు స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతదేహానికి అలంపూర్ ఆరోగ్య కేంద్రంలో పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమద్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్పీ ఆదేశానుసారం సమద్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంత్యక్రియలకుగాను రూ.20 వేలు అందించినట్లు ఏఎస్‌ఐ వివరించారు.
చెరువులో పడి
వ్యక్తి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. మండలంలోని ఔరాసిపల్లికి చెందిన ప్రభాకర్ (39) హైదరాబాద్‌లో మేసీ్త్ర పని చేసుకొని జీవనం సాగించే వాడు. ఈ నెల 13న స్వగ్రామానికి వచ్చిన అతడు తిరిగి వెళ్లలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో నాగనూలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య బలన్మరణం
వంగూర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వంగూర్ మండలం నర్సంపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేందర్ వివరాల మేరకు.. నర్సంపల్లికి చెందిన పార్వతమ్మ (45) భర్త వెంకటయ్య అనారోగ్యంతో 20 రోజుల క్రితం మృతిచెందాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొంత సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం

టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం