
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ జీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ అంతరాయాలు ఏర్పడిన వెంటనే పునరుద్ధరించేలా మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ సబ్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. వచ్చే మూడు నెలల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచడం, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ వచ్చే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు. 16 సర్కిళ్ల పరిధిలో కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్నాయని, అందుకు తగట్లు రిలీజ్ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఈలను ఆదేశించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు వందశాతం జరిగేలా నోడల్ జనరల్ మేనేజర్లు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, వి. తిరుపతిరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్‌లాల్, బి.అశోక్ కుమార్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, తదితరులు పాల్గొన్నారు.