
ఎంపీఎస్‌ఓల కొరత
మహబూబాబాద్: జిల్లాలో ప్రతీ మండలంలో వర్షపాతం నమోదు కోసం ఒక ఎంపీఎస్‌ఓ అధికారి ఉండాలి. అయితే జిల్లాలోని 18 మండలాలకు 10మంది మాత్రమే ఉన్నారు. ఆటోమేటిక్ వర్షపాతం నమోదు బాధ్యత అంతా సీపీఓ కార్యాలయ అధికారులదే కాగా.. ఒక టెక్నీషియన్‌కు మరమ్మతుల నిర్వహణ, ఇతర బాధ్యతలు అప్పగించారు. కాగా సిబ్బంది కొరతతో వర్షపాతం నమోదులో కొంత జాప్యంతో పాటు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి
16 మాన్యువల్ నమోదు కేంద్రాలు..
జిల్లాలో18మండలాలు,482 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా పాత 15 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలో మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉ న్నా యి. మానుకోట మండలానికి చెందిన కేంద్రం మా త్రం ఆర్డీఓ కార్యాలయంలో ఉంది. ఇటీవల ఏర్పా టు చేసిన సీరోలు, ఇనుగుర్తి మండలాల్లో ఏర్పాటు చేయలేదు. ఎంపీఎస్‌ఓలు రికార్డుల్లో వర్షపాతం వివరాలు నమోదు చేసిన తర్వాత కలెక్టర్ కార్యాల యం, ఆర్డీఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి.
వేధిస్తున్న కొరత..
18 మండలాలకు గాను 18 మంది ఎంపీఎస్‌ఓలు ఉండాలి. కానీ 10 మంది మాత్రమే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన మండలాల్లో ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి నమోదు, నిర్వహణ చేపడుతున్నారు. దీంతో పలువురి అధికారులపై పనిభారం పడుతోంది.
ఒక్కరే టెక్నీషియన్..
18 మండలాలకు గాను 23ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉన్నాయి. వాటి నిర్వహణ, రిపేర్ కోసం ఒక్కరే టెక్నీషియన్ పని చేస్తున్నారు. ఆటోమేటిక్ మిషన్లలో చాలా సమస్యలు వస్తాయి. అన్ని మండలాలకు ఒక్కరే వెళ్లాల్సి వస్తోంది. కాగా మరో టెక్నీషియన్‌ను నియమిస్తే సమస్యలు చాలా వరకు తీరుతాయి.
ఇంటిగ్రేటెడ్ వర్షపాతం ఫైనల్..
ఎంపీఎస్‌ఓలు సంబంధిత వెబ్‌సైట్ లాగిన్‌లో వివరాలు నమోదు చేయాలి. అలాగే ఆటోమెటిక్ వర్షపాతం వివరాలను సీపీఓ సిస్టమ్‌లో సంబంధిత టెక్నీషియన్ మొబైల్‌లో చూడవచ్చు. కాగా ఎంపీఎస్‌ఓలు, టెక్నీషియన్లు సంబంధిత వెబ్‌సైట్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ కేంద్రాల వర్షపాతం వివరాలను నమోదు చేస్తారు. అదే ఫైనల్‌గా ప్రభుత్వం ప్రకటిస్తుంది.
అక్కడ ఏర్పాటు చేయాలి..
ఇటీవల ఏర్పాటు చేసిన సీరోలు, ఇనుగుర్తి మండలాల్లో మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అలాగే కేంద్రాల నిర్వహణ, మరమ్మతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడితే నమోదు వివరాలు కచ్చితంగా వస్తాయి.
అన్నీ పనిచేస్తున్నాయి..
23 ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రతీరోజు నమోదును రికార్డు చేస్తున్నాం. ఎలాంటి సమస్య లేకుండా తగు ఏర్పాట్లు చేశాం. భద్రతా దృష్ట్య్టా సబ్ స్టేషన్‌లలో 22 ఏర్పాటు చేసి, ఒకటి మల్యాల కేవీకేలో ఏర్పాటు చేశాం. కొత్త మండలాల్లో వర్షపాతం నమోదు కేంద్రాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం.
– దుర్గరాజు, ఉప గణాంక అధికారి
23 ఆటోమేటిక్ నమోదు కేంద్రాలు..
జిల్లాలో 23 ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉన్నాయి. కాగా మానుకోట మండలంలో 3, నెల్లికుదురు 2, నర్సింహులపేట 2, దంతాలపల్లి 1, తొర్రూరు 1, పెద్దవంగర 1, మరిపెడ 1, చిన్నగూడూరు 1, కురవి 1, సీరోలు 1, డోర్నకల్ 2, బయ్యారం 1, గార్ల 1, ఇనుగుర్తి 1, కేసముద్రం 1, గూడూరు 1, కొత్తగూడ 1, గంగారం మండలంలో ఒకటి ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రం ఉన్నాయి. వాటిని భద్రత దృష్టా విద్యుత్ సబ్ స్టేషన్‌ల పరిధిలో ఏర్పాటు చేశారు. గంటగంటకు వర్షపాతం నమోదు అవుతుంది.
వర్షపాతం నమోదులో తలెత్తుతున్న సమస్యలు
జిల్లాలో 16 మాన్యువల్
వర్షపాతం నమోదు కేంద్రాలు
23 ఆటోమేటిక్ ఎంట్రీ సెంటర్లు