
గాలిలో దీపాలు!
వీరి ప్రాణాలు..
భద్రత లేని విద్యుత్‌శాఖలోని అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల జీవితాలు
క్షేత్రస్థాయిలో కీలక విధులు..
తరచూ ప్రమాదాలు
వెట్టి చాకిరీ తప్ప ఉద్యోగ భద్రత కరువు..
మంచానికే పరిమితమైన భాస్కర్..
జఫర్‌గఢ్: విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ఇటీవల షాక్‌కు గురైన తాటికాయల భాస్కర్ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. జఫర్‌గఢ్ శివారు వడ్డెగూడేనికి చెందిన భాస్కర్ 2012లో విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్‌గా విధుల్లో చేరాడు. కొన్నేళ్ల నుంచి ఓబులాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఎల్‌సీ తీసుకుని స్తంభం ఎక్కి కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా భాస్కర్ నడుము భాగంతో పాటు రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అలాగే, కుడి చెయ్యి మూడు వేళ్లను సైతం తొలగించారు. వైద్యానికి సుమారు రూ.10 లక్షలు కాగా రూ. 7 లక్షల వరకు డిపార్ట్‌మెంట్ ద్వారా ఖర్చు చేయగా మిగతా డబ్బులు బాధిత కుటుంబ సభ్యులు భరించాల్సి వచ్చింది. అయినా భాస్కర్ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వారానికోసారి హెల్త్ చెకప్ కోసం వెళ్లిన సందర్భంలో రూ. 10వేల నుంచి 15 వేలు ఖర్చు అవుతోందని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తాము ఏమి చేయలేమంటున్నారని బాధితుడి భార్య అనూష ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్తతో పాటు ముగ్గురు పిల్లల పోషణ భారం పూర్తిగా తనపైనే పడిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటోంది.
టీజీ ఎన్పీటీసీఎల్‌లో అన్‌మ్యాన్ కార్మికులుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు వెట్టి చాకిరీ తప్ప ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడం నుంచి.. నూతన లైన్ ఏర్పాటు, మరమ్మతులు, బిల్లుల వసూళ్లు తదితర అన్ని రకాల పనులు వీరితోనే చేయిస్తారు. అయినా ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 40 ఏళ్ల వయసు దాటుతుండడంతో ఉద్యోగ అర్హత కోల్పోవాల్సి వస్తోందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం వీధిన పడాల్సి వస్తోంది. అయి నా పట్టించుకున్న నాథుడే కరవవుతున్నాడని పలువు రు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఏళ్లుగా పనిచేస్తున్న అన్‌మ్యాన్ కార్మికులను పర్మనెంట్ చేసి నెలనెలా బ్యాంకు అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
– సాక్షి నెట్‌వర్క్

గాలిలో దీపాలు!