దేవరుప్పుల : పీడిత ప్రజానీకం కోసం నిత్యం పాటుపడే విప్లవ పార్టీలను అంతమొందించేందుకు ప్రధాని మోదీ చే స్తున్న కుట్రలను ఛేదించేందుకు కమ్యూనిజం భావజాల శక్తులు ఐక్యం కావడం అనివార్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్తూపం, విగ్రహానికి నారాయణతోపాటు అరుణోదయ స మాఖ్య వ్యవస్థాపకులు విమలక్క, ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు కుమారస్వామి, తదితరులు పూలమాల వేసి నివాళులుర్పించారు. అనంతరం కొమురయ్య స్మారక భవనంలో జరిగిన సంస్మరణ సభకు సీపీఐ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య అధ్యక్షత వహించగా నారాయణ మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు డెడ్‌లైన్ పేరిట సరిహద్దు సైన్యాన్ని అంతర్గతంగా వినియోగిస్తూ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. ఇదే మణిపూర్‌లో సాయుధ పంథాను అణిచివేయకుండా చూడడంలోనే వారి స్వార్థ పాలన వెల్లడైందన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచే పాలకులు రాజ్యాంగాన్ని మార్చలేరని హితవు పలికారు. నిజాం పాలనలో దొడ్డి కొమురయ్య పోరాట పటిమతోనే సాయుధ పోరాటం ఆవిర్భవించిందన్నారు. దీనితోనే బానిసత్వం, దున్నేవాడికి భూమితోపాటు భూస్వామ్య విధానం రద్దు అయ్యిందన్నారు. నేటికీ విస్నూ ర్ దేశ్‌ముఖ్ మూలాలకు చెందిన ప్రొఫెసర్ పాండురంగా రావు.. సాయుధ పోరాటాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. ఎర్రజెండా ద్వారానే అన్ని వర్గాల ప్రయోజనాలు సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్ల నర్సింహులు వారసురాలు చింతకింది అరుణక్క, సీపీఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రావు, సుగుణమ్మ, సాయన్న, సొప్పరి సోమయ్య, బిల్లా తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, ఎల్లయ్య, ప్రశాంత్, సుజిత్, సోమనారాయణ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
విముక్తి పోరుకు స్ఫూర్తిప్రదాత దొడ్డి కొమురయ్య
కార్పొరేట్ కోసమే ప్రకృతి సంపద దోపిడీకి యత్నం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ