
సర్కారు బడిబాట
సాక్షి, మహబూబాబాద్: సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు పెరుగుతోంది. బడుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం.. బడిబాటను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతానికి భిన్నంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు సర్కారు బడిబాట పడుతున్నారు. దీంతో గతంలో మూసివేసిన పలు పాఠశాలలు తెరుచుకున్నాయి. గత విద్యా సంవత్సరం వరకు తక్కువ పిల్లలతో వెలవెలబోయిన పాఠశాలలు నిండుగా విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
4,601 మంది చేరిక
ఈ విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి నిర్వహించిన బడి బాట కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 899 పాఠశాలల్లో 4,601 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో కొత్తగా చేరారు. ఇందులో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివి 5 సంవత్సరాలు నిండిన వారు 1,846 మంది ఉండగా గతంలో ప్రైవేట్ పాఠశాలల్లో చదివి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారు 2,755 మంది ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కురవి మండలంలో 461 మంది పిల్లలను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచింది. కేవలం 10 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన చిన్నగూడూరు మండలం చివరి స్థానంలో నిలిచింది.
తెరుచుకున్న పాఠశాలలు..
పిల్లలు లేరనే కారణంతో గత ఏడాది మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం తెరుచుకుంటున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో 148 పాఠశాలలు విద్యార్థులు లేక మూత పడ్డాయి. ఇందులో అత్యధికంగా మరిపెడ మండలంలో 36 పాఠశాలలు ఉండగా.. మహబూబాబాద్ 19, డోర్నకల్ 12, చిన్నగూడూరు 9, తొర్రూరు 8పాటు ఇతర మండలాల్లో మిగిలిన పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది బయ్యారం మండలంలోని ఎంపీపీఎస్ కొత్తూరు హెచ్‌సీ, ఎంపీపీఎస్ ఐజీ రోడ్ బయ్యారం, ఎంపీపీఎస్ బండ్లకుంట, ఇనుగుర్తి మండలంలోని ఎంపీపీఎస్ లక్ష్మీపురంతండా, ఎంపీపీఎస్ మాస్‌కుంట తండా, మహబూబాబాద్ మండలం లోని ఎంపీపీఎస్ హజారియాతండా, ఎంపీపీఎస్ చీకటిచింతల తండా, సీరోలు మండలంలోని ఎంపీపీఎస్ గుజిలీతండా, ఎంపీపీఎస్ కర్లకుంట తండా, పెద్దవంగర మండలంలోని ఆర్‌ఎంఎస్ తండాలోని పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోంది.
నమ్మకం కలిగించాం..
అన్ని వసతులు, ఉత్తమ ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత మేరకు అపనమ్మకం ఉంది. ఈ విషయంపై తల్లిదండ్రులతో మాట్లాడి మంచి బోధన అందిస్తామని ఒప్పించాం. నమ్మకం కలిగించే విధంగా వారికి నచ్చజెప్పాం. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. ఈ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. – రవీందర్ రెడ్డి, డీఈఓ
●
ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న విద్యార్థులు
పిల్లల రాకతో మూతబడిన
10 పాఠశాలల్లో బోధన
పలు స్కూళ్లలో
ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ
బడి బాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు
మండలం అంగన్‌వాడీల ప్రైవేట్ మొత్తం
నుంచి పాఠశాలల
నుంచి
బయ్యారం 112 128 240
చిన్నగూడూరు 00 10 10
దంతాలపల్లి 59 219 278
డోర్నకల్ 131 212 343
గంగారం 80 03 83
గార్ల 146 115 261
గూడూరు 162 184 346
ఇనుగుర్తి 45 63 108
కేసముద్రం 90 149 239
కొత్తగూడ 110 24 134
కురవి 144 317 461
మహబూబాబాద్ 150 263 413
మరిపెడ 169 210 379
నర్సింహులపేట 66 133 199
నెల్లికుదురు 162 198 360
పెద్దవంగర 65 268 333
సీరోలు 78 110 188
తొర్రూరు 77 149 226
మొత్తం 1,846 2,755 4,601

సర్కారు బడిబాట