
స్నాతకోత్సవాన్ని అడ్డుకోవద్దు
కేయూ క్యాంపస్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కాకతీయ యూనివర్సిటీలో నిర్మించేందుకు పాలకమండలి ఆమోదం తెలపగా దాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అంతేగాకుండా ఆమోదాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈనెల 7న కేయూలో జరిగే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని కూడా వివిధ విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం విదితమే. దీంతో కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులతో క్యాంపస్‌లోని అకడమిక్ కమిటీ హాల్‌లో సమావేశం నిర్వహించి, వారితో చర్చలు జరిపారు. హహనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ పాల్గొన్నారు. స్నాతకోత్సవ వేడుకకు సహకరించాలని వీసీ, రిజిస్ట్రార్ విద్యార్థి సంఘాల బాధ్యులను కోరారు. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు యంగ్ ఇండియా స్కూల్‌కు ఎట్టి పరిస్థితుల్లోను భూమి ఇవ్వొద్దని యూనివర్సిటీ భూమిని కేటాయిస్తూ పాలక మండలి ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించినట్లు సమాచారం. పాలకమండలి ఆమోదంను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా తమకు పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలని పలు విద్యార్థి సంఘాల బాధ్యులు కోరారని సమాచారం. మరో రెండు విద్యార్థి సంఘాల బాధ్యులు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని యూనివర్సిటీ భూమిలోనే నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.
గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు
అవకాశం
యూనివర్సిటీ సమస్యలపై గవర్నర్‌కు విన్నవించేందుకు తమకు అవకాశం కల్పించాలని పలు విద్యార్థి సంఘాల బాధ్యులు కోరారు. స్నాతకోత్సవం తర్వాత లంచ్ అయిపోయాక కేయూ గెస్ట్‌హైజ్ వద్ద గవర్నర్‌ను కలిసేలా అవకాశం కల్పిస్తామని విద్యార్థి సంఘాల నాయకులకు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, వీసీ ప్రతాప్‌రెడ్డి తెలియజేశారని సమాచారం. దీంతో విద్యార్థి సంఘాల బాధ్యులు కూడా ఒకే అన్నట్లు తెలిసింది.
భూమిని కేటాయించబోమని..
పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలని..
ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కేయూ భూమిని కేటాయించబోమని వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదివారం వరకు ప్రకటించాలని లేనిచో స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని ఓ విద్యార్థి సంఘం నాయకులు తేల్చిచెప్పారని సమాచారం. అలాగే తమకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తామని కూడా వీసీ ప్రకటించి హామీ ఇవ్వాలని లేకుంటే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని మరో విద్యార్థి సంఘం నాయకుడు తేల్చి చెప్పారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో పోలీస్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం.
వీసీ, రిజిస్ట్రార్, పోలీసు అధికారులు
విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు