
‘కొలంబో’పై సీబీఐ కేసుతో ఉత్కంఠ
కాజీపేట రూరల్ : ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాలపై సీబీఐ కేసు ఘటన అందరిలో ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ హంటర్ రోడ్డు బ్రిడ్జి సమీపంలోని ఫాదర్ కొలంబో మెడికల్ ఆస్పత్రి (ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సీబీఐ కేసు ఘటన మెడికేర్ ఆస్పత్రి వర్గాల్లో, మెడికల్ కాలేజీ వర్గాల్లో దడ పుట్టిస్తోంది. 2023లో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌రావు ఈ మెడికల్ కళాశాలను ప్రారంభించారు. క్యాంపస్‌లో మెడికేర్ జనరల్ ఆస్పత్రి, ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మెడికల్ విద్యార్థులకు ల్యాబ్ సదుపాయాలు, బోధన, వసతి, పరికరాలు, ఫ్యాకల్టీ, మేనేజ్‌మెంట్ సిస్టం మొదలగునవి నిర్వహణ ఉండాలి. మెడికల్ కాలేజీ నిర్వాహణలో నిబంధనలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అధికార అనుమతుల కోసం ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ట్రస్టీ మెంబర్ కొమ్మారెడ్డి జోసెఫ్ మెడికల్ కాలేజీల తనిఖీలో అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు రూ.46 లక్షలు లంచం ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో తేలింది. ఈ విషయంలో జోసెఫ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ సీబీఐ కేసు విషయంలో అసలు ఏం జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా కళాశాల నడుస్తుందని కాలేజీ వర్గాలు అంటున్నాయి.
ఆస్పత్రి, మెడికల్ కాలేజీ వర్గాల్లో
టెన్షన్ టెన్షన్