
మనుమడి మృతి తట్టుకోలేక..
కురవి: మనుమడి మృతి తట్టుకోలేక మనోవేదనతో అమ్మమ్మ చనిపోయింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బుర్ర జగదాంబ కుమారుడు శ్రీకాంత్ విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్ కార్మికుడిగా పనిచేస్తూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన తండా బుచ్చమ్మ(85) ఐదు సంవత్సరాలుగా తన బిడ్డ జగదాంబ ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో మనుమడు శ్రీకాంత్ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల నుంచి గుండలిసేలా రోదిస్తూ మనోవేదనతో ఆదివారం మృతిచెందింది. దీంతో బుచ్చమ్మ, శ్రీకాంత్ అంత్యక్రియలు ఒకే సారి నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం తీసుకెళ్తుండగా గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
● మనోవేదనతో అమ్మమ్మ కన్నుమూత
● నేరడలో విషాదఛాయలు