
సర్వ దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్
మంత్రాలయం: శ్రీమఠంలో సర్వదర్శనాలకు గురువారం ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. దళారుల దందాను అరికట్టేందుకు శ్రీమఠం అధికారులు ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చారు. సెక్యురిటీ గార్డులు, ఇతర సిబ్బంది క్యూలైన్ల దరిదాపుల్లోకి రాకుండా అధికారులే ప్రత్యక్ష పర్యవేక్షణకు దిగారు. మఠం ప్రధాన ముఖ ద్వారం ముంగిట కారిడార్‌లో స్టాఫర్లతో క్యూలైన్ విధానం అమల్లోకి తెచ్చారు. మఠం మేనేజర్లు, సూపరింటెండెంట్స్ పర్యవేక్షణలో దర్శనాలకు అనుమతించారు. ఇక సేవా భక్తులు, గ్రామ భక్తులకు మాత్రం 6,7 నంబర్ల గేట్ల క్యూలైన్లలో దర్శనాలకు అవకాశం కల్పించారు. భక్తులు ఎవ్వరూ మోసపోకుండా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 184
వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 184 వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ రత్నప్రసాద్ తెలిపారు. ఈ ప్రదర్శనా క్షేత్రాలను వ్యవసాయ శాఖ రెగ్యులర్ ఏడీఏల ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రదర్శన క్షేత్రానికి రూ.4 వేల ప్రకారం రూ.7.33 లక్షలు ఏడీఏలకు విడుదల చేసినట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, ఆదోని సబ్ డివిజన్‌లో 18, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ సబ్ డివిజన్‌లలో 17, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల సబ్ డివిజన్‌లలో 16 ప్రకారం వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా సబ్ డివిజన్‌లలో సాగు చేసే ప్రధాన పంటల్లో వీటిని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కర్నూలు అర్బన్ బ్యాంక్ సీఈఓ తొలగింపు
కర్నూలు(అగ్రికల్చర్): ది కర్నూలు అర్బన్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈఓగా పనిచేస్తున్న ఎస్‌ఏ రఫీక్‌ను విధుల నుంచి తొలగించినట్లు అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ చైర్మన్ నాగరమణయ్య తెలిపారు. ఈ నెల 2వ తేదీన సాక్షి దినపత్రికలో ‘రూ.2.42 కోట్ల ప్రజాధనం స్వాహా’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన సెక్షన్ 51 విచారణలో ఎస్‌ఏ రఫీక్ పేరు కూడా ఉన్నందున విధుల నుంచి పూర్తిగా తొలగించినట్లు నాగరమణయ్య తెలిపారు. సంఘంలోని సభ్యులు, డైలీ డిపాజిట్ చేసే వారు.. ఇతరులు ఎవ్వరైన ఈయనకు ఎలాంటి నగదు చెల్లించవద్దని సూచించారు. ఎవ్వరైనా ఈయనకు నగదు చెల్లిస్తే సంఘం ఎలాంటి బాధ్యత వహించదని పేర్కొన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా బి. రాధిక
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బి.రాధిక గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ జేడీగా విధులు నిర్వహించిన జె.రంగలక్ష్మిదేవి అమరావతి డైరెక్టరేట్‌కు బదిలీ కాగా, ఆమె స్థానంలో ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి డీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తు వచ్చారు. అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమం, సాధికారత అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న బి.రాధికను ప్రభుత్వం గత నెల 6న ఇక్కడకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె డీడీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా జిల్లాలోని సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు కలిసి అభినందనలు తెలిపారు.

సర్వ దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్

సర్వ దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్