
అంకిరెడ్డిపల్లెలో పిచ్చికుక్క దాడి
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో గురువారం పిచ్చికుక్క దాడిలో 12 మంది గాయపడ్డారు. ఎస్సీ కాలనీ, ప్రధాన రహదారి, మెయిన్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని కాలనీలతోపాటు పలు వీధుల్లో పిచ్చికుక్క సంచరించి రామాంజనేయులు, పల్లె శివరామిరెడ్డి, మూగెన్న తదితరులపై దాడి చేసింది. గ్రామంలో కొద్ది సేపు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న పిల్లలను బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచారు. ఆవుపై కూడా పిచ్చికుక్క దాడి చేసింది. అయితే కొందరు వ్యక్తులు పిచ్చి కుక్కపై కట్టెలతో దాడి చేసి చంపేశారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
యువకుడి ఆత్మహత్య
బండి ఆత్మకూరు: లింగాపురం గ్రామంలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పాతకోట చెన్నయ్య (30) మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. మానసికంగా కుంగిపోయి గురువారం తెల్లవారుజామున ఇంటిలో ఉరేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య అంకమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
కోసిగి: చెట్టు పై నుంచి కింద పడి కోసిగి హనుమంతు (27) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌడుగల్లు గ్రామానికి చెందిన కోసిగి హనుమంతు గతనెల 28న తన పొలంలో ఉన్న నేరేడు పండ్లను రాల్చేందుకు చెట్టును ఎక్కాడు. పండ్లను రాల్చే సమయంలో కాలు జారి నుంచి కిందకు పడిపోయాడు. గాయాలు కావడంతో కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు హస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందాడు. కోసిగి హనుమంతుకు భార్య నాగవేణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కోసిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళ మృతి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్తి పెట్రోల్ బంకు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. డోన్‌కు చెందిన లక్ష్మీదేవి, కుమారుడు సుదర్శన్ కర్నూలులోని వ్యవసాయ కార్యాలయంలో పని నిమిత్తం బైక్‌పై కర్నూలుకు వస్తుండగా మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాదు వెళ్లే రోడ్డులో గుత్తి పెట్రోల్ బంకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మొదట్లో పల్సర్ బైక్ సర్వీస్ రోడ్డులోకి వస్తుండగా వెనుక వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. కోలుకోలేక లక్ష్మీదేవి మృతిచెందింది. కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యం
ఓర్వకల్లు: మండలంలోని ఎన్.కొంతలపాడు గ్రామానికి చెందిన ఈడిగ వెంకటరాముడు(55) అదృశ్యమైనట్లు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మానసిక పరిస్థితి బాగోలేక గత నెల 29న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ద్యర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ నంబరు 9121101067కు సమాచారం ఇవ్వాలన్నారు.