
వజ్రాల వంకను చూసేందుకు వచ్చి..
మహానంది: నల్లమలలోని వజ్రాల వంకలో వజ్రాలు దొరుకుతున్నాయని.. అందరూ అంటుంటే సరదాగా చూసేందుకు వచ్చిన ఇద్దరు కుమారులతో వచ్చిన తండ్రి ఓ కుమారుడిని పోగొట్టుకున్నాడు. ప్రమాదవశాత్తూ వాగులో పడి బాలుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు...నంద్యాలలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన యాకూబ్ ఖాన్, ఆయన కుమారుడు అజ్మతుల్లా, మరో కుమారుడు నల్లమలలోని సర్వనరసింహస్వామి సమీపంలో ఉన్న వజ్రాల వాగు దగ్గరికి వచ్చారు. అక్కడ కాసేపు పిల్లలతో సరదాగా గడిపారు. అజ్మతుల్లా(15) బహిర్భూమికి అని వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. కుమారుడిని కాపాడేందుకు యాకూబ్‌ఖాన్, మరో కుమారుడు వెళ్లగా కాలువ లోతు ఎక్కువగా ఉండటం వల్ల వారు బయటికి రాలేకపోయారు. స్థానికులు ఆ ఇద్దరిని కాపాడారు. నీటిలో మునిగిపోయిన అజ్మతుల్లా కొద్ది సేపటి తర్వాత శవమై తేలాడు. విషయం తెలుసుకున్న రోడ్‌సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలం శిరివెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తమకు ఎలాంటి కేసు వద్దని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
వాగులో పడి బాలుడి మృతి