
నేడు జాతీయ లోక్ అదాలత్
కర్నూలు (సెంట్రల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్‌వీ శేషాద్రి తెలిపారు. సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతో ప్రతి మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మార్చి తర్వాత శనివారం రెండోసారి జిల్లా లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 16 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో కేసుల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు న్యాయమూర్తులు వారివారి స్థానాల్లో ఉండి కేసుల పరిష్కారం చేస్తారన్నారు. అన్ని రకాల సివిల్, రాజీ కాగల క్రిమినల్, రోడ్డు ప్రమాద , చెక్ బౌన్స్, బ్యాంకు, మున్సిపల్ కేసులు, అలాగే భార్యాభర్తల వివాదాలు, ఇన్సూరెన్స్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కారం చేస్తామని చెప్పారు. కక్షిదారులకు రాజీయే రాజమార్గమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడచిన సంవత్సర కాలం నుంచి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఆధ్వర్యంలో ఐదుసార్లు జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించి వేలాది కేసుల పరిష్కారం చేసినట్లు ఆయన వివరించారు.