అమ్మా వెళ్లొస్తా..! | Kid Dies After Falling Under School Bus In Kurnool, More Details Inside | Sakshi
Sakshi News home page

అమ్మా వెళ్లొస్తా..!

Jul 5 2025 11:36 AM | Updated on Jul 5 2025 12:18 PM

 Kid Dies After Falling Under School Bus

చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్సు

తల్లి కళ్ల ముందే విషాదం

కర్నూలు: అమ్మా.. బాయ్‌.. బాయ్‌..’ అంటూ ఉదయం స్కూల్‌ బస్సులో వెళ్లిన చిన్నారి సాయంత్రం అదే బస్సులో తిరిగి వచ్చింది. బస్సులో బిడ్డను చూసి ఆ తల్లి కళ్లలో ఆనందం మెరిసింది. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే మాయమైంది. కళ్ల ముందే బిడ్డపై బస్సు చక్రాలు వెళ్లడంతో ఆ తల్లి తల్లడిల్లింది. ఉదయం బడికెళ్తూ తన బిడ్డ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంది. రక్తపుమడుగులో తడిసి విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. 

బడి బస్సు ఆ చిన్నారి పాలిట మృత్యుశకటమైంది. ఈ విషాద ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎంవీనగర్‌కు చెందిన శ్రీధర్‌, వనజ దంపతుల కూతురు హరిప్రియ (4) స్థానిక కీర్తన స్కూల్‌లో యూకేజీ చదువుతోంది. సోమవారం నుంచి స్కూల్‌కు వెళ్తుండగా రోజూ తండ్రి శ్రీధర్‌ వదిలి, తిరిగి తీసుకొచ్చేవారు. అయితే శుక్ర వారం నుంచి స్కూల్‌ బస్సులో పంపడం మొదలు పెట్టారు. స్కూల్‌ ముగించుకుని మొదటిసారిగా బస్సులో వస్తున్న కూతురుని దించుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయిబాబా గుడిదగ్గర తల్లి వనజ వేచి ఉంది. 

బస్సులో నుంచి అమ్మను చూసిన ఆ చిన్నారి ‘అమ్మా నేను దిగుతున్నా.. అని చెయ్యి ఊపుతూ’ ఇవతలి వైపున దిగింది. ఆ తర్వాత అవలి వైపున ఉన్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు అడుగు ముందుకు వేసింది. అంతలోనే డ్రైవర్‌ బస్సు కదిలించడంతో చిన్నారి బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డ మృతితో ఆ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణ సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ నగీన ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement