
సుంకేసులకు దిక్కెవరు?
● తుంగభద్ర నదికి వారం రోజుల్లో
వరదలొచ్చే అవకాశం
● బ్యారేజీకీ ఏడాదికిపైగా ఏఈఈ లేరు
● అదనపు బాధ్యతలతోనే
నెట్టుకొస్తున్న పరిస్థితి
● 12 మంది తాత్కాలిక
ఉద్యోగులతోనే సరి
● కేసీ కెనాల్ కర్నూలు సబ్ డివిజన్‌కు
ఏడాదిగా డీఈఈ పోస్టు ఖాళీ
● ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోకుండా
అడ్డుకుంటున్న ఇంజనీర్
కర్నూలు సిటీ: దక్షిణ భారత దేశంలోనే అత్యంత పురాతనమైనది కర్నూలు–కడప కాలువ (కేసీ కెనాల్). ఈ కాలువకు నీటిని మళ్లించేందుకు తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీ ఎంతో కీలకమైంది. అలాంటి బ్యారేజీ నిర్వహణను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేసింది. దేశంలో అత్యంత నమ్మకంగా నీటి లభ్యత కలిగిన నదుల్లో తుంగభద్ర ఒకటి. ఈ నదికి ఏటా వరదలు వస్తుంటాయి. వరదల సమయంలో సుంకేసుల బ్యారేజీ వద్ద పర్యవేక్షణ చేసేందుకు రెగ్యులర్ సిబ్బంది, ఏఈఈ ఇంజినీర్ లేరు. చాలా ఏళ్లుగా రెగ్యులర్ సిబ్బంది లేక 12 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాటు ఏడాదికిపైగా రెగ్యులర్ ఏఈఈని నియమించకపోవడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో తుంగభద్ర నదికి ఇప్పటికే రెండు, మూడు సార్లు వరద నీరొచ్చింది. ఈ బ్యారేజీ నుంచి ఏటా 150 నుంచి 450 టీఎంసీలకుపైగా వరద నీరు ప్రవహిస్తుంది. అంత కీలకమైన చోట రెగ్యులర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెగ్యులర్ డీఈఈ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఏఈఈ బాధ్యతలు తాత్కాలికంగా మరో ఇంజినీర్‌తో చేయించుకుంటున్నారు. కాలువకు నీరు వదిలితే సదరు ఇంజినీర్ తన రెగ్యులర్ విధులతో పాటు, అదనపు భాద్యతలు నిర్వహించడం భారంగానే ఉంటుంది. రెగ్యులర్ ఏఈఈ లేకపోవడంతో బ్యారేజీపై పర్యవేక్షణ కరువై.. నిర్వహణ పనులను సైతం సక్రమంగా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
రెగ్యులర్ డీఈఈ నియామకాన్ని
అడ్డుకుంటున్నదెవరు?
కర్నూలు–కడప కాలువ కర్నూలు సబ్ డివిజన్‌లో డీఈఈగా పనిచేస్తున్న రఘు రామిరెడ్డి గతేడాది నాణ్యత నియంత్రణ విభాగానికి బదిలీ అయ్యారు. ఆ తరువాత హంద్రీనీవా సుజల స్రవంతి డివిజన్–3లో డీఈఈగా పనిచేస్తున్న ప్రసాద్‌రావుకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ విధులతో పాటు, అదనపు బాధ్యతలను ఏడాది పాటు నిర్వహించారు. అయితే ఈ ఏడాది మార్చి తరువాత హంద్రీ – నీవా విస్తరణ పనులు మొదలు కావడంతో అదనపు బాధ్యతల నిర్వహణ కష్టంగా మారింది. ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రసాద్‌రావు హంద్రీ – నీవా సర్కిల్–2 పరిధిలోని అనంతపురం బత్తులపల్లికి బదిలీ అయ్యారు. అదనపు బాధ్యతలు చూసే డీఈఈ బదిలీ అయినా ఇంతవరకు రెగ్యులర్ డీఈఈని నియమించలేదు. తుంగభద్ర నదికి వరదలు వస్తున్న సమయంలో బ్యారేజీకి ఏఈఈ, డీఈఈలు, ఇద్దరు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో నిర్వహణ పర్యవేక్షణపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి కేసీ కర్నూలు సబ్ డివిజన్‌కి రెగ్యులర్ డీఈఈని నియమించకుండా ఏడాదిగా ఓ ఇంజినీర్ సొమ్ములిచ్చి కూటమి నేతల ద్వారా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌చార్జ్ బాధ్యతలు చూస్తున్న డీఈఈ సైతం పక్క జిల్లాకు బదిలీ అయినా తన బాధ్యతలు కొనసాగేలా ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్లు జల వనరుల శాఖలో చర్చ జరుగుతుంది. ఈ విషయంపై జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ బాలచంద్రారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.