
పేదల ఆసుపత్రిలో ‘పెద్దాపరేషన్లు’
● ప్రొక్లెయిన్ పొట్ట చీల్చింది.. పెద్దాసుపత్రి ప్రాణం పోసింది ● మరో బాలుడికి అరుదైన శస్త్రచికిత్సతో సాధారణ జీవితం
కర్నూలు(హాస్పిటల్): అరుదైన ఆపరేషన్లు చేస్తూ పెద్దాసుపత్రి మరింత ఖ్యాతిని సొంతం చేసుకుంటుంది. కార్పొరేట్ హాస్పిటళ్లలో జరిగే పెద్ద పెద్ద శస్త్రచికిత్సలను సర్వజన వైద్య సిబ్బంది చేస్తూ పేదల ప్రాణాలను నిలుపుతున్నారు. ఇటీవల ఇద్దరు బాలురకు అరుదైన ఆపరేషన్ చేయడంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన ఇనాయతుల్లా కుమారుడు షేక్ తౌఫిక్(17) నంద్యాలలోని జేవీఆర్ కాలేజీలో ఐటీఐ చదువుతున్నాడు. గత మార్చిలో రంజాన్ పండుగకు సొంతూరికి వచ్చిన అతను పండుగకు ఒక రోజు ముందు స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతన్ని ప్రొక్లెయిన్(జేసీబీ) ఢీకొంది. వాహనానికి ముందు భాగం నేరుగా ఢీకొనడంతో అతని పొట్ట చీలిపోయి పేగులు, డియోడినమ్ ఛిద్రమయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు స్థానికంగా ప్రాథమిక వైద్యం చేయించి 31వ తేదీ రాత్రి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. పరిస్థితి చూసిన వైద్యులు సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ శృతి, అనెస్తెటిస్ట్ డాక్టర్ సోమశేఖర్ చలించిపోయారు. వెంటనే రాత్రి 10 గంటలకు అత్యవసర ఆపరేషన్ థియేటర్‌కు తరలించి తెల్లవారుజామున 5 గంటల వరకు వివిధ దశల్లో ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. 43 రోజుల పాటు వివిధ రూపాల్లో చికిత్స నిర్వహించడంతో కోలుకున్నాడు. దీంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
పుట్టుకతోనే మలద్వారం లేకపోవడంతో..
అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన వేణుగోపాల్(15)కు పుట్టుకతోనే మలద్వారం ఏర్పడలేదు. ఈ దశకు అతను శిశువుగా ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేసి తాత్కాలిక మలద్వారాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి అతనికి మలవిసర్జన సరిగ్గా ఉండేది కాదు. నిత్యం డైపర్స్ వాడాల్సి వచ్చేది. చికిత్స కోసం అతను గత ఏప్రిల్ 18న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ సర్జరీ విభాగానికి వచ్చాడు. ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల నేతృత్వంలో అతనికి ఈ నెల 7న మలద్వారాన్ని ఏర్పాటు చేసి కండరాలు బలోపేతం అయ్యేలా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం అందరిలానే మలవిసర్జన చేయగలుగుతుండటంతో మంగళవారం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.