
కాంగ్రెస్ నేత హత్య కేసులో మరో ఏడుగురి అరెస్టు
ఆలూరు రూరల్: ఆలూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్, రాయలసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హత్యకేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మేకల శ్రీనివాసులు, సారాయి పెద్దన్న, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, జీర్ల ధనుంజయ, దొడ్ల మనోహర్‌లను బుధవారం ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు–బళ్లారి రహదారిలోని విడపకల్లు వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఏఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ రవి శంకర్ రెడ్డి, చిప్పగిరి, ఆలూరు, హొళగుంద ఎస్‌ఐలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, దిలీప్ కుమార్‌లతో కలిసి బుధవారం ఆలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. గత నెల 27వ తేదీన గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఆలూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ లక్ష్మీనారాయణ కారును లారీతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఓ భూ వివాదంలో లక్ష్మీ నారాయణ కలుగచేసుకుని గౌసియా, పెద్దన్న, గుమ్మనూరు నారాయణపై ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించాడన్నారు. దీంతో ముగ్గురు కలసి లక్ష్మీనారాయణను అంతమొందించారన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మొదట 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే బేపర్ గౌసియా, రాజేష్, సౌభాగ్యలను ఈ నెల 2వ తేదీ అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. అనంతరం కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. ఈ మేరకు అదుపులో తీసుకున్న ఏడుగురు లక్ష్మీనారాయణను హత్య చేసినట్లు చెప్పారు. అలాగే గుమ్మనూరు నారాయణ ప్రమేయం ఉండడంతో మంగళవారం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. దీంతో ఈ హత్యకేసులో 15 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. కాగా లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వైకుంఠం ప్రసాద్, వైంకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు నమోదు చేయగా విచారణలో వారి ప్రమేయం లేదని తేలిందన్నారు. హత్య కేసులో ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందని బాధితులు ఆధారాలతో నిరూపిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.